ప్రాచీన భారతీయ రుషి పరంపర నుంచి వరంగా వచ్చిన సనాతన క్రియాయోగ ధ్యానం అభ్యసించడం ద్వారా ఆనందకరమైన, సాఫల్యవంతమైన జీవితం సాధ్యమని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు. ఈ ధ్యానం ద్వారా శారీరక రుగ్మతలు తొలగి, మానసిక వైఫల్యాలు అధిగమించి ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని తొలగించుకోగలుగుతారని ఆయన చెప్పారు.
ఈ ధ్యానం ద్వారా నిశ్చలత్వం ఏర్పడి ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఆయన తెలిపారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి స్మరణానంద ప్రసంగించారు. క్రియాయోగం శాస్త్రీయమైనదని, దీని అభ్యాసం ద్వారా శాస్త్రీయ ఫలితాలు సాధ్యమని ఆయన తెలిపారు.
క్రమబద్ధంగా ఈ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు భగవదాన్వేషణలో సత్వర పురోగతి సాధ్యమని ఆయన తెలిపారు. పరమహంస యోగానంద స్థాపించిన వైఎస్ఎస్ క్రియాయోగ పాఠాలు, అందులో పేర్కొన్న పద్ధతులు సాధకులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. వైఎస్ఎస్ పాఠాల ద్వారా ప్రయోజనం పొందాలని స్వామి స్మరణానంద సాధకులకు సూచించారు. కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు, క్రియోయోగులు వేలాదిగా పాల్గొన్నారు.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!