ఎన్నికల ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం

ఎన్నికల ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం

ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్‌ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది.

ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్‌ 93(2)(ఏ)ను శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా వివరణ ఇచ్చాయి. కొత్త సవరణతో ఎలక్ట్రానిక్‌ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. 

పోలింగ్‌ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫుటేజ్‌ను వినియోగించుకుని కృత్రిమ మేధ ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్‌ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్‌ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని వివరించాయి.

హరియాణా ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను మహమ్మద్‌ ప్రాచా అనే వ్యక్తికి షేర్‌ చేయాలని ఇటీవల పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు ఆదేశించింది. రూల్‌ 93 (2)లో పత్రాలు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ రికార్డులనే విభజన లేనందున అన్ని రికార్డులను ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దీనిని ఈసీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలకు సవరణ చేసింది.

అయితే ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ, అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.