అమిత్ షా వీడియోతో బిజెపిని బూచిగా చూపే యత్నం

అమిత్ షా వీడియోతో బిజెపిని బూచిగా చూపే యత్నం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో పేరుతో బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విమర్శించారు.  75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలను పార్లమెంట్‌లో చూశామని చెబుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ ఆమె నిప్పులు చెరిగారు. భారతదేశాన్ని ఎప్పుడూ తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని, అసలు ఆ పార్టీ వ్యవస్థాపకులు విదేశీయులు కాదా? అంటూ యామిని ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.
 
సనాతన ధర్మం అంటే రాహుల్ గాంధీకి అర్థం తెలుసా?,అని ఆమె ప్రశ్నించారు.  రాజ్యాంగ వ్యతిరేకులుగా గాంధీ కుటుంబం తయారైందని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ అంబేడ్కర్‌, పేదల పథకాలకు గాంధీ కుటుంబం వ్యతిరేకమంటూ ఆమె మండిపడ్డారు. అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారని, గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ను అవమానిస్తూనే ఉందని ఆమె ఆరోపించారు. 
 
అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ నేతలు కాదా? అని యామిని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఆయన విగ్రహం ఏర్పాటుకూ కాంగ్రెస్ సహకరించలేదని ఆమె మండిపడ్డారు. దేశ విద్రోహ శక్తులుగా రాహుల్, ప్రియాంక గాంధీ తయారయ్యారని ఆమె ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌ను రాజీనామా చేయించింది అప్పటి కాంగ్రెస్ పెద్దలే కాదా అంటూ ఆమె మండిపడ్డారు. 
 
అంబేద్కర్ ఆశయాలను పాటించేది బీజేపీ మాత్రమేనని యామిని స్పష్టం చేశారు. అసలు రిజర్వేషన్ల అర్థం ఏంటో రాహుల్ గాంధీకి తెలుసా? అంటూ ఆమె నిప్పులు చెరిగారు. సిక్కులను ఊచకోత కోసింది, దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఆమె హితవు చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లను రాహుల్ గాంధీ వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా? అంటూ యామిని ఆరోపించారు. 
 
మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు పార్లమెంట్‌కు బీజేపీ తెచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని ఆమె గుర్తు చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడాన్నిఆమె తీవ్రంగా ఖండిస్తూ సాటి మహిళా ఎంపీని రాహుల్ తూలనాడడం మహిళా నేతగా ఖండిస్తున్నట్లు యామిని శర్మ చెప్పారు