విద్యుత్తు చోరీలో సంభ‌ల్ ఎంపీకి రూ.1.91 కోట్ల జ‌రిమానా

విద్యుత్తు చోరీలో సంభ‌ల్ ఎంపీకి రూ.1.91 కోట్ల జ‌రిమానా
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంభ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన లోక్‌స‌భ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌కు.. ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ 1.91 కోట్ల జ‌రిమాన విధించింది. విద్యుత్తును చోరీ చేసిన ఘ‌ట‌న‌లో స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీపై విద్యుత్తు చ‌ట్టం సెక్ష‌న్ 135 ప్ర‌కారం కేసు బుక్ చేశారు. ఆ ఎంపీ ఇంటికి విద్యుత్తు స‌ర‌ఫ‌రాను కూడా నిలిపివేశారు.

కొన్ని రోజుల క్రితం, విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని ఎంపీ జియావుర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులతో దీప్ సరాయ్ ప్రాంతంలోని ఎస్పీ ఎంపీ ఇంటికి వెళ్లారు. భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.  పాత రెండు మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు. ఆ తర్వాత రెండు పాత మీటర్లను సీల్ చేసి పరీక్షల నిమిత్తం పంపించారు. గ‌త ఆర్నెల్ల నుంచి ఆ మీట‌ర్లు జీరో యూనిట్ చూపించాయి. ఆ రెండు మీట‌ర్ల‌ను ల్యాబ్‌కు పంప‌గా, ఎంఆర్ఐ టెస్టులో ఆ మీట‌ర్లు ట్యాంప‌రింగ్ జ‌రిగిన‌ట్లు తెలిసింది.

ఆ నివేదిక ప్రకారం విద్యుత్ మీటరుతో సంబంధం లేకుండా ఎంపీ ఇంటికి విద్యుత్ సరఫరా జరిగిందని తేల్చారు. ఆ తర్వాత మళ్లీ ఎంపీ ఇంటికి వెళ్లారు. స్మార్ట్‌ మీటర్ల రీడింగ్‌ తీసి, ఇంట్లో అమర్చిన విద్యుత్‌ పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం ఎంపీ ఇంటికి రెండు కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్లు రెండు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆయన ఇంట్లో 16 కిలోవాట్లకు పైగా విద్యుత్తు వినియోగిస్తున్నారని తేల్చారు.

దీంతో ఎంపీ విద్యుత్ చౌర్యం చేసినట్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆయనకు రూ.1.91 కోట్లు జరిమానా విధించారు. అయితే తనిఖీల సమయంలో ఇంజనీర్లు అజయ్ శర్మ, వీకే గంగల్‌ను బెదిరించినందుకు ఎంపీ తండ్రి మమ్లుకూర్ రెహమాన్ బార్క్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రభుత్వం మారిందని, తమ ప్రభుత్వం వస్తే అంతుచూస్తామని మమ్లుకూర్ బెదిరించారని రికార్డు అయిన వీడియో ఆధారంగా కేసు పెట్టారు. కాగా, న‌వంబ‌ర్ 24వ తేదీన సంభ‌ల్‌లోని షాహి జామా మ‌సీదు ఘ‌ట‌న‌లో ఎంపీ రెహ్మాన్‌పై కేసు బుక్ అయింది.