క్రైమ్​ బ్రాంచ్​కు పార్లమెంట్​ తోపులాట కేసు

క్రైమ్​ బ్రాంచ్​కు పార్లమెంట్​ తోపులాట కేసు

పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాట ఘటనలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీపై నమోదైన కేసు డిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యింది. తోపులాటలో ఎంపీలు ప్రతాప్‌ చంద్ర షడంగీ, ముకేశ్‌ రాజ్‌పుత్‌కు గాయాలు కావడానికి రాహుల్‌ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్‌ జోషి, అనురాగ్‌ ఠాకూర్‌, బాన్సురీ స్వరాజ్‌ పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు డిల్లీ క్రైమ్‌బ్రాంచ్‌ దర్యాప్తు చేయనుంది. రాహుల్‌ను విచారణకు పిలిచి వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలోని సీసీటీవీల ఫుటేజీని తమకు అందించాలని వారు పార్లమెంటు అధికారులకు లేఖ రాయనున్నారు. 

ఎంపీలు షడంగీ (ఒడిశా), రాజ్‌పుత్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) వాంగ్మూలాలను వారు నమోదు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ ఎంపీలు గురువారం అనుచితంగా ప్రవర్తించారంటూ హస్తం పార్టీ నేతలు దాఖలు చేసిన ఫిర్యాదుపై విడిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై న్యాయ సలహా కోరినట్లు పోలీసులు తెలిపారు.

దానితో పాటు బీజేపీపై కాంగ్రెస్‌ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైన కూడా డిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారంటూ ఎన్డీఏ, ఇండియా కూటమి ఎంపీలు పరస్పరం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పార్లమెంటు మకరద్వారం మెట్ల వద్ద వారి మధ్య తోపులాట జరిగింది. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్‌ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు.

కాగా, అమిత్‌ షా ప్రసంగానికి సంబంధించి నేరపూరితంగా ఎడిట్‌ చేసిన ఓ వీడియోను రాహుల్‌గాంధీ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబె ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. అంబేడ్కర్‌ పట్ల దేశ తొలి ప్రధాని నెహ్రూ అనుచితంగా వ్యవహరించిన తీరును షా తన ప్రసంగంలో ప్రస్తావించారని, రాహుల్‌ తెలివిగా సంబంధిత వీడియోను ఎడిట్‌ చేసి చూపుతున్నారని ఆరోపించారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు.

మరోవంక, అంబేడ్కర్‌పై వ్యాఖ్యల వ్యవహారంలో అమిత్‌ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. డిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద వారు నిరసన ప్రదర్శన చేపట్టారు. అక్కడి నుంచి పార్లమెంటుకు ర్యాలీగా వెళ్లారు. పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ విలేకర్లతో మాట్లాడుతూ, అమిత్‌ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 

ఎంపీల తోపులాటకు సంబంధించి రాహుల్‌పై కేసు నమోదు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేడ్కర్‌పై షా వ్యాఖ్యల వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్‌పై కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు.