కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి ఎల్జీ అనుమతి!

కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి ఎల్జీ అనుమతి!
మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. 

ఈ కేసులో డిసెంబర్ 5న మాజీ సీఎంను విచారిచేందుకు ఈడీ అనుమతి కోరగా, అందుకు ఎల్జీ తాజాగా అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసినట్లు సదరు వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10 నుంచి జూన్‌ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్‌ మంజూరైంది. జూన్‌ 2న ఆయన మళ్లీ జైలులో లొంగిపోగా, జూన్‌ 20న ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ దక్కింది. 

బెయిల్‌ను ఈడీ సవాల్‌ చేయడంతో జూన్‌ 25న హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. జూన్‌ 26న ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ సీబీఐ అప్పటికే అరెస్టు చేయడం వల్ల ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.  ఇక సెప్టెంబర్‌ 13న సీబీఐ కేసులోనూ కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ దక్కడంతో ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన చివరికి సెప్టెంబర్‌ 14వ తేదీన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ కేసులోనే ఈడీ మ‌రోసారి కేజ్రీవాల్‌ను విచారించేందుకు సిద్దమ‌వుతోంది. కేజ్రీవాల్‌పై గతంలోనే మనీల్యాండరింగ్ కేసు నమోదయినప్పటికీ విచారణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నవారిని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈడీ లేఖ రాసింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయ మద్యం పాలసీ వ్యవహారంలో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు అందాయనేది ప్రధాన ఆరోపణ.

జైలు నుండి విడుదలైన తర్వాత సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. తన వారసురాలిగా అతిషిని నియమించారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌తో పాటు మనిష్ సిసోడియాలే కీలకంగా వ్యవహరించారనే ప్రధాన ఆరోపణ. సీబీఐ, ఈడీలు కేసులు నమోదుచేసి పలువుర్ని అరెస్ట్ చేసింది. సిసోడియాను కూడా అరెస్ట్ చేయగా.. 18 నెలలు జైల్లో ఉన్న ఆయన ఈ ఏడాది ఆగస్గులో బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.