మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే కూలిన జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ చాప‌ర్‌

మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే కూలిన జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్  చాప‌ర్‌
2021 డిసెంబర్ 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేసిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కీలక విషయాలను రాబట్టింది. దీనిపై రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ తయారు చేసిన నివేదిక తాజాగా లోక్‌సభ ముందు ఉంచింది.

మానవ తప్పిదం కారణంగానే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆ ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయినట్లు అందులో ధ్రువీకరించారు. 2017 నుంచి 2022 వరకు మొత్తం 34 ఐఏఎఫ్ ప్రమాదాలు జరిగినట్లు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. 2021-2022 మధ్య 9 ప్రమాదాలు జరిగాయని, ఇక 2021 డిసెంబర్ 8వ తేదీన జరిగిన ప్రమాదం మానవ తప్పిదం అని ప్యానెల్ తెలిపింది.

తమిళనాడులోని కూనూర్‌లో 2021 డిసెంబర్‌ 8వ తేదీన జరిగిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదంలో అప్పటి సీడీఎస్‌ బిపిన్‌ రావత్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులిక సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో ప్రసంగించేందుకు  తమిళనాడులోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి బయల్దేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.  ఆ ప్ర‌మాదం ప‌ట్ల ర‌క్ష‌ణ‌శాఖ స్థాయి సంఘం క‌మిటీ నివేదిక‌ను త‌యారు చేసింది.

ఆ రోజు ఉదయం రావత్‌ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో బిపిన్ రావత్‌ దంపతులు సహా అంతా మృతిచెందినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక ప్రకటన వెలువరించింది.
 
ఈ ప్రమాదం పూర్తిగా మానవ తప్పిదమేనని నివేదిక తేల్చింది. ఆ హెలికాప్టర్‌ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయని, దీంతో ఆ పైలట్ అయోమయంలో హెలికాప్టర్‌ను హఠాత్తుగా మేఘాల్లోకి తీసుకెళ్లడంతోనే అది కూలిపోయిందని తేల్చారు. ఫ్లైట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులను విశ్లేషించామని, ఆ తర్వాత కొందరు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారణ జరిపిన తర్వాత ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి గల కారణంపై ఒక అంచనాకు వచ్చినట్లు స్టాండింగ్‌ కమిటీ ఆ రిపోర్ట్‌లో పేర్కొంది