తిరుమలలో గంటలోపే శ్రీవారి దర్శనం

తిరుమలలో గంటలోపే శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనానికి రద్దీ రోజుల్లో 36 గంటలపైనే సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుండడంతో శ్రీవారిని దర్శించుకోకుండానే వాహన సేవలను తిలకించి కొందరు వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. టిటిడి నూతన ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు ఆధ్వర్యాన ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ (ఎఐ) టెక్నాలజీని గురువారం నంచి అమలు చేస్తున్నారు. 

ఈ టెక్నాలజీని వారం రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలకమండలిలో ఆమోదం లభించనుంది. గంటలోపే శ్రీవారి దర్శనం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకున్న సందర్శకులకు మొదటగా వారి ఆధార్‌ కార్డు నంబర్‌, ఫేస్‌ రికగజేషన్‌ (ముఖ ఆధారిత)తో కూడిన రసీదు ఇస్తారు. 

అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్‌ అందిస్తారు. ఈ టోకెన్‌ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్దకు చేరుకోగానే ఫేస్‌ రికగ్నిషన్‌ ఎంట్రన్స్‌లో స్కానింగ్‌ అనంతరం క్యూ లైన్‌లోకి పంపుతారు. గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది. 

ఈ టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తోంది. ఎక్కడా సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు నాలుగు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే టిటిడిలో అమలు చేస్తున్న విధానం, సందర్శకులకు అనుమతిస్తున్న విధానం, టిటిడి పరిస్థితులు, రోజుకు తిరుమలకు వస్తున్న సందర్శకుల సంఖ్య తదితర సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు టిటిడి అందించింది.