ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు పుతిన్ సిద్ధం

ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు పుతిన్ సిద్ధం
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తో చర్చలకు సిద్ధం అనే సంకేతం ఇచ్చారు. పైగా, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు.
అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చెప్పారు. రాజకీయాలు అంటే `సంప్రదింపులు, రాజీపడటం’గా తాను భావిస్తూ ఉంటానని తెలిపారు.  చర్చలు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనువుగా ఉండాలని చెబుతూ గతంలో తాను ప్రస్తావించిన షరతులను పరోక్షంగా గుర్తు చేశారు.
యుక్రెయిన్ నాటోలో చెరకుడదని, యుద్ధంలో తాము సాధించిన విజయాలను గుర్తించాలని గతంలో చెప్పగా, అందుకు ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు తిరస్కరించాయి.  ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని పేర్కొంటూ జెలెన్‌స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని తెలిపారు. 

గురువారం పుతిన్‌ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్‌ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్‌ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ విజయవంతమవుతోందని వెల్లడించారు.

2022లో ఉక్రెయిన్ కు తమ సైనికులను పంపడం రష్యా సైనిక, ఆర్ధిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు పుతిన్ తెలిపారు. ఇంకా ముందుగానే చేసిఉండాల్సిందని చెబుతూ మరింత ముందస్తు సన్నాహాలు చేసి ఉంటె బాగుండేదిదని చెప్పారు.

మరోవైపు, రష్యాకు మిత్రుడైన సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ను తొలగించడంతో తమ ప్రతిష్టకు భంగం ఏర్పడిందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. రష్యా ఆశ్రయం ఇచ్చిన అసద్ ను తాను ఇంకా కలుసుకోలేదని, త్వరలో కలుసుకుంటానని చెప్పారు. సిరియాలో మొత్తం మీద తాము తమ  లక్ష్యాలను సాధించామని పుతిన్ స్పష్టం చేశారు. 

ఒకప్పుడు అస్సాద్ పాలనతో, ప్రభుత్వ దళాలతో పోరాడిన సమూహాలు కూడా అంతర్గత మార్పులకు గురయ్యాయని గుర్తు చేశారు. “నేడు అనేక ఐరోపా దేశాలు, అమెరికా వారితో సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకోవడం వృధా కాదు. అవి ఉగ్రవాద సంస్థలు అయితే, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అంటే వారు మారిపోయారు, కాదా?” అని ఆయన ప్రశ్నించారు.