రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ పై అభిశంసన నోటీసు తిరస్కరణ

రాజ్యసభ ఛైర్మన్‌  ధన్‌ఖడ్‌ పై అభిశంసన నోటీసు తిరస్కరణ

రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అభిశంసనకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును సభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తిరస్కరించారు. ధన్‌ఖడ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో, ప్రచారం కోసమే నోటీసు ఇచ్చినట్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ తన నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు, సభకు తెలియజేశారు.

ఈ నోటీసులకు వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్ధమైన ఆందోళన కంటే ప్రచారం పొందడమే లక్ష్యంగా ఉందని డిప్యూటీ ఛైర్మన్ పేర్కొన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్యంలో అత్యున్నత రాజ్యాంగ హోదా అయిన ఉపరాష్ట్రపతిని అప్రతిష్టపాలు చేసే చర్యలుగా అభివర్ణించారు. తనపై నోటీసులు రావడం వల్ల అభిశంసన తీర్మానంపై నిర్ణయం తీసుకోకుండా ధన్‌ఖడ్‌ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

డిసెంబర్ 10న వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత విపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ ఛైర్‌పర్సన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు అందజేశాయి. సభలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.  మొత్తం 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు.

కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎమ్, జేఎమ్ఎమ్కు చెందిన దాదాపు 60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు తీర్మానంపై సంతకాలు చేయలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు తీర్మానంపై సంతకం చేయలేదని ఆ పార్టీ వెల్లడించింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని ఆయన / ఆమెను పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తీర్మానాన్ని ఆ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ ఆమోదించాలి. అయితే ఆ తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కనీసం 50 మంది సభ్యులు ఉండాలి. 14 రోజుల ముందస్తు నోటీసును ఇవ్వాలి.