జమిలి ఎన్నికలు 2034లో గాని సాధ్యం కావా!

జమిలి ఎన్నికలు 2034లో గాని సాధ్యం కావా!
 
లోక్‌సభలో మంగళవారం జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన రెండు బిల్లులతో దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిల్లో మొదటిది లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా రెండోది ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించినది.
 
ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. ఈ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందగానే జమిలి ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. 2027లోనే జమిలి ఎన్నకలు జరుపుతున్నట్లు కధనాలు కూడా వెలువడుతున్నాయి. లోక్ సభలో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండు వంతుల ఆధిక్యత అధికార కూటమికి లేకపోవడంతో ఈ బిల్లులు ఆమోదం పొందటం ఒక వంక ప్రశ్నార్ధకంగా ఉంది.
 
మరోవంక ఈ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ వెంటనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కనీసం మరో పదేళ్ళపాటు ఆగాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
 
జమిలి ఎన్నికలకు అపాయింటెడ్‌ తేదీగా లోక్‌సభ తొలిసారిగా సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్‌ కమిటీ ఇదివరకే సిఫారసు చేసింది. ఈ క్రమంలో రాజ్యాంగంలో కొత్తగా పొందుపర్చబోతున్న ఆర్టికల్‌ 82ఏలోని తొలి క్లాజు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని కచ్చితత్వంతో చెప్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం జమిలి తాజా బిల్లులో పేర్కొన్న విషయాలను బట్టి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్‌సభ సమావేశంలో ఆర్టికల్‌ 82ఏను రాష్ట్రపతి నోటిఫై చేయనున్నట్లు వెల్లడించారు. ఆ రోజునే అపాయింటెడ్‌ డేగా తీసుకొంటారు. 18వ లోక్‌సభ ఎన్నికలు గత మే-జూన్‌లో జరిగిపోయాయి. గత జూన్‌లోనే తొలిసారిగా లోక్‌సభ సమావేశం పూర్తైంది.

ఈ లెక్కన 2029లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడే తొలి లోక్‌సభ సమావేశంలోనే రాష్ట్రపతి ఆర్టికల్‌ 82ఏను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్‌ నోటిఫై అయ్యాకే, అంటే ఆ రోజు నుంచి ఐదేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాతనే లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సదరు క్లాజులో పేర్కొన్నారు. 

ఈ లెక్కన 2034లోనే జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్లు బిల్లు స్పష్టం చేస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. జమిలి ఎన్నికల నిర్వహణకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2024లో రాజ్యాంగంలోని మూడు ఆర్టికల్స్‌ను సవరించడంతో పాటు కొత్తగా ఆర్టికల్‌ 82ఏను చేర్చాలని కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది.

ఆర్టికల్‌ 82ఏ(1): జమిలి బిల్లు ఆమోదం పొందిన తర్వాత సాధారణ ఎన్నికలు జరిగిన పిదప కొలువుదీరే తొలి లోక్‌సభలో రాష్ట్రపతి ఈ క్లాజును నోటిఫై చేయాలి. ఆ రోజునే అపాయింటెడ్‌ డేగా పరిగణించాలి.

ఆర్టికల్‌ 82ఏ(2): అపాయింటెడ్‌ డే తర్వాత ఏర్పడిన అన్ని రాష్ర్టాల అసెంబ్లీల కాలపరిమితి ఆ లోక్‌సభ కాల పరిమితితోనే ముగుస్తుంది. అంటే అవసరమైతే, అసెంబ్లీల కాలపరిమితిలో కుదింపు జరుగొచ్చు. అలాగే, లోక్‌సభ కంటే ముందు ఏర్పడిన అసెంబ్లీల కాలపరిమితి లోక్‌సభ కాలపరిమితికి అనుగుణంగా పొడిగింపు కూడా ఉంటుంది.

ఆర్టికల్‌ 82ఏ(3): లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికల సంఘం (ఈసీ) ఎలక్షన్స్‌ను నిర్వహిస్తుంది.

ఆర్టికల్‌ 82ఏ(4): ఈ క్లాజు జమిలి ఎన్నికలను నిర్వచిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలు నిర్వహించడమే దీని లక్ష్యం.

ఆర్టికల్‌ 82ఏ(5): కొన్ని అనివార్య పరిస్థితులు తలెత్తినప్పుడు లోక్‌సభతో పాటు ఏదైనా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించలేని వెసులుబాటు ఈసీ కలిగి ఉంది.

ఆర్టికల్‌ 82ఏ(6): లోక్‌సభతో కాకుండా కొంత జాప్యంతో ఎన్నికలు జరిగిన అసెంబ్లీ కాలపరిమితి ఆ లోక్‌సభతోనే ముగిసిపోతుంది.

సవరణ చేయబోతున్న ఆర్టికల్స్‌

ఆర్టికల్‌ 83: ఈ ఆర్టికల్‌లో మళ్లీ ఐదు క్లాజులు ఉన్నాయి. లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఐదేండ్ల కాలపరిమితి ఉంటుందని తొలి క్లాజు పేర్కొంటున్నది. ఐదేండ్ల కాలపరిమితితో కొలువుదీరే లోక్‌సభ మధ్యలో రైద్దెతే మిగిలిన కాలాన్ని వీగిపోని కాలంగా (అన్‌ఎక్పైర్డ్‌ టర్మ్‌) పరిగణించాలని రెండో క్లాజు చెప్తుంది. 

లోక్‌సభ రైద్దెన తర్వాత మిడ్‌టర్మ్‌ ఎన్నికలతో కొత్త లోక్‌సభ కొలువుదీరుతుందని మూడో క్లాజు తెలియజేస్తుంది. అలా ఏర్పడిన కొత్త లోక్‌సభ మిగిలిన కాలానికి మాత్రమే (ఐదేండ్ల కంటే తక్కువ) ఉంటుందని నాలుగో క్లాజు చెప్తుంది. మిడ్‌టర్మ్‌ ఎలక్షన్స్‌ ద్వారా కొలువుదీరిన లోక్‌సభ, అంతకు ముందు రైద్దెన లోక్‌సభ కాలంతో కలిపి మొత్తంగా ఐదు ఏండ్లు పూర్తికాగానే మళ్లీ సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ఐదో క్లాజు చెప్తున్నది.

ఆర్టికల్‌ 172: ఆర్టికల్‌ 83లోని ఐదు క్లాజులు ఎలాగైతే లోక్‌సభ కాలపరిమితికి సంబంధించిన నిబంధనలను వెల్లడించాయో, ఆర్టికల్‌ 172 క్లాజులు అసెంబ్లీలకు అలాగే వర్తిస్తాయి. అసెంబ్లీల కాలవ్యవధి అనేది లోక్‌సభకు అనుగుణంగానే ఉంటుంది.

ఆర్టికల్‌ 327: రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలు (ఎలక్టోరల్‌ రోల్‌, నియోజకవర్గాల పునర్విభజన వగైరా) పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని ఈ ఆర్టికల్‌లో పేర్కొన్నారు.