రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరం

రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో, పార్టీ  ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ రాజ్ భవన్ ముందు అదానీ ఆర్హ్దిక అక్రమాలపై చర్యలు తీసుకోవాలి అంటూ ధర్నా చేయడం విడ్డూరం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతోవ్ 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకుందని ధ్వజమెత్తారు.

ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద, మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి  ప్రజలు  నవ్వుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. వంద కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా? అని ప్రశ్నించారు.

ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి? ఒక సాక్ష్యం చూపిస్తారా? అని సవాల్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో, ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ ఇవాళ అసహనంతో అదానీ మాట మాట్లాడుతోందని మండిపడ్డారు.

జార్జ్ సొరోస్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి నవ్వులపాలైంది కాంగ్రెస్ పార్టీ అంటూ కిషన్ రెడ్డి ఎదురు దాడికి దిగారు. అర్థంలేని అవినీతి ఆరోపణలు భారతదేశ వ్యవస్థలపై చేపించి గాలి మాటలు, గత్తర మాటలతో కాంగ్రెస్ పార్టీ ఆగమైందని చెప్పారు. అదాని అక్రమాలపై జెపిసి వేయకపోతే రాష్ట్రపతి భవనం ముందు ధర్నా చేస్తామని  రేవంత్ చెప్పడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి విమర్శించారు. 

రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోత,మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?  అందుకే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా? అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదని ధ్వజమెత్తారు.

ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆ రెండు పార్టీల పనిచేసే తీరు ఒక్కటే అని తెలిపారు.