జమిలి బిల్లుపై 31 మందితో జెపిసి

జమిలి బిల్లుపై 31 మందితో జెపిసి
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును పరిశీలించడానికి 31 మంది సభ్యులతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగం, సంబంధిత చట్టాలను సవరిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు. 
 
ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, నూతనంగా ఎన్నికైన ప్రియాంకగాంధీసహా 21 మంది లోక్‌సభ సభ్యులకు, మరో 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించారు. లోక్‌సభ నుంచి కమిటీలో ఉండబోయే 21 మంది సభ్యులలో 10 మంది బిజెపికి చెందిన వారు, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జనసేన, శివసేన (షిండే), ఆర్‌ఎల్‌డిలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. 
 
కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఎన్‌సిపి, టిఎంసి, డిఎంకె, ఎన్‌సిపికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. బిజెపి నుంచి పిపి చౌదరి, సిఎం రమేష్‌, బాన్సూరి స్వరాజ్‌, పురుషోత్తం రూపాలా, అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, విష్ణు దయాళ్‌ రామ్‌, భర్తృహరి మహతాబ్‌, సంబిత్‌ పాత్ర, అనిల్‌ బలుని, విష్ణు దత్‌ శర్మ ఉన్నారు. 
 
జిఎం హరీష్‌ బాలయోగి (టిడిపి), శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ షిండే (శివసేన షిండే), చందన్‌ చౌహాన్‌ (ఆర్‌ఎల్‌డి), వల్లభనేని బాలశౌరి (జనసేన) ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్‌ తివారీ, సుఖదేయో భగత్‌ ఉన్నారు. ధర్మేంద్ర యాదవ్‌ (ఎస్‌పి), కల్యాణ్‌ బెనర్జీ (టిఎంసి), టిఎం సెల్వగణపతి (డిఎంకె), సుప్రియా సూలే (ఎన్‌సిపి) ఉన్నారు. 
 
ఈ కమిటీలో సభ్యులుగా ఉండబోయే మరో పది మంది పేర్లను రాజ్యసభ చైర్మన్ ప్రకటించనున్నారు. ఆ తర్వాత కమిటీ చైర్మన్ ను ప్రభుత్వం ప్రకటిస్తుంది.