రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్
 
పార్లమెంట్‌ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య తోపులాట నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్, బిజెపి ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. రాహుల్ గాంధీ భౌతిక దాడి జ‌రిపార‌ని, రెచ్చ‌గొట్టిన‌ట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
పార్లమెంట్ ప్రవేశం వద్ద బీజేపీ మహిళ ఎంపీలను రాహుల్​ గాంధీ నెట్టివేసినట్లు మంత్రులు జేపీ నడ్డా, కిరెన్ రిజిజు ఆరోపించారు. వాళ్లకి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలతో రాహుల్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్లు నడ్డా తెలిపారు. మ‌రో వైపు గాయ‌ప‌డ్డ బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌ల‌తో ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్ల‌డారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం ఆర్ఎంఎల్ ఆస్ప‌త్రిలో ఆ ఇద్ద‌రూ చికిత్స పొందుతున్నారు.

ఇరువురి తలకు గాయాలు కావడంతో వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ అజయ్ శుక్లా తెలిపారు. గారికి ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామని చెప్పారు. సృహకోల్పోయిన ఎంపీ ముకేశ్​ రాజ్‌పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని, అందుకే పరీక్షలు చేశామని, రిపోర్ట్స్​ ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు.

ఇలా ఉండగా, బీజేపీ, ప్రతిపక్ష నేతల కారణంగా పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొన్న గందరగోళ సమయంలో రాహుల్‌ తనను అసౌకర్యానికి గురిచేసినట్లు నాగాలాండ్ కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగ్​దీప్​ ధన్​ఖడ్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కాగా, బీజేపీ ఎంపీలు తనను తోసేసినట్లు మల్లికార్జున ఖర్గే లోక్​సభ స్పీకర్​కు తెలిపారు. బీజేపీ ఎంపీలు నెట్టడం వల్లే బ్యాలెన్స్ తప్పి మకర ద్వారం వద్ద కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు లోక్​సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారని, ఆయనను పార్లమెంట్​లోకి రాకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. 

నాలుగు రోజుల క్రితమే ఎంపీల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవద్దని స్పీకర్ చెప్పారని, అయినా బీజేపీ వాళ్లు రాహుల్​ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు.  కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు చేశారు. పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు అంద‌జేశారు. దీంట్లో ఆ పార్టీ మ‌హిళా ఎంపీలు కూడా ఉన్నారు.

మరోవంక, అంబేద్కర్ వివాదం నుండి హోంమంత్రి అమిత్ షాను కాపాడటం కోసం తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. రాహుల్ గాంధీకి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు తెలిపారు. ఆయనది అటువంటి వ్యక్తిత్వం కాదని స్పష్టం చేశారు.