
సరిహద్దుల్లో శాంతి స్థాపన, గత నాలుగేళ్లుగా స్తంభించిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణతో సహా పలు అంశాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య బుధవారం చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాల్లో ఆరోగ్యకరమైన, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడానికి భారత్, చైనాలు అంగీకారానికి వచ్చాయి.
చైనా ప్రత్యేక ప్రతినిధుల చర్చల 23వ రౌండ్‌లో పాల్గొనేందుకు భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఢోబాల్ చైనా పర్యటనకు వెళ్లారు. భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న దోవల్ మంగళవారమే ఇక్కడకు చేరుకున్నారు. ఐదేళ్ల విరామం అనంతరం జరుగుతున్న ప్రత్యేక ప్రతినిధుల 23వ సమావేశంలో పాల్గొనేందుకు వీరు అక్కడకు వెళ్లారు.
చైనా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు చర్చలు ఆరంభమయ్యాయి. తూర్పు లడఖ్‌లో గస్తీకి, బలగాల ఉపసంహరణ కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించుకునేందుకు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతున్నారు. భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా వుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియాకు తెలిపారు.
ఇరు దేశాల నేతల మధ్య కుదిరిన ఉమ్మడి అవగాహన, సర్దుబాటును అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరస్పర ప్రయోజనాలు కలిగిన అంశాలను గౌరవిస్తూ, చర్చలు, కమ్యూనికేషన్ ద్వారా పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలని నేతలు భావించారు. సరిహద్దుల్లో శాంతి భద్రతల నిర్వహణపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించనున్నారు. సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించాలని నిర్ణయించారు.
చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించారు. టిబేట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాల వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్యం పెంపు వంటి అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
సమావేశం సందర్భంగా సరిహద్దు సమస్యలపై ఇరు దేశాల మధ్య కుదిరిన పరిష్కారాన్ని ఇరు పక్షాలు సానుకూలంగా మదింపు చేసి అమలు పనులు కొనసాగించాలని పునరుద్ఘాటించినట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని, ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది.
‘దశల వారీగా రోడ్‌మ్యాప్‌పై అంగీకారానికి వచ్చాం… ఇది వివాదాస్పద అంశాలను పక్కనబెట్టి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సమస్యలను సులభంగా పరిష్కరించడానికి సహకరిస్తుంది’ అని చైనా తెలిపింది.అయితే, భారత్ మాత్రం దానిని ప్రస్తావించకపోవడం గమనార్హం. సైనిక బలగాల ఉపసంహరణపై అక్టోబరు 21న జరిగిన ఒప్పందం అమలు ఫలితంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ మొదలైందని భారత్ పేర్కొంది.
మొత్తం ద్వైపాక్షిక సంబంధాల నుంచి సరిహద్దు వివాదాలను వేరుచూసి.. సరైన రీతిలో పరిష్కరించుకోవాలని తద్వారా ఆ ప్రభావం సంబంధాలపై పడకుండా చూసుకోవాలని నిర్ణయించారు. సముచిత, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన ప్యాకేజీలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని తీర్మానించారు.
అలాగే, ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని అవగాహనకు వచ్చారు.
ఈ ఏడాది అక్టోబరు 21న గల్వాన్ లోయ ప్రతిష్టంభన తర్వాత సరిహద్దు నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కితగ్గాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, చైనా మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో 2003లో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమైంది. చివరి సారిగా 2019లో చర్చలు జరిపింది. తాజాగా మూడోసారి సమావేశమై ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యలపై చర్చించింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు