కనీసం పెన్షన్ పెంచాలి … పార్లమెంటరీ కమిటీ

కనీసం పెన్షన్ పెంచాలి … పార్లమెంటరీ కమిటీ

కనీస పెన్షన్‌ను పెంచాలని లేబర్‌ కమిటీ కేంద్రాన్ని కోరింది. బిజెపి సీనియర్‌ నేత బసవరాజ్‌  బొమ్మై నేతృత్వంలోని లేబర్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ, ఎంప్లాయిస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఇపిఎస్‌) కింద ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్‌ఒ) చెల్లించే కనీస పెన్షన్‌ను రూ. వెయ్యి పెంచాలని కేంద్రానికి సిఫారసు చేసింది. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటులో కమిటీ  నివేదిక సమర్పించింది.

నెలకు కనీస పెన్షన్‌ రూ. వెయ్యి అమలులోకి వచ్చి దశాబ్ద కాలం గడిచిందని కమిటీ నివేదికలో  పేర్కొంది. 2014తో పోలిస్తే, ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 2024లో జీవన వ్యయం అనేక రెట్లు పెరిగిందని 2023లో మౌఖికంగా వివిధ సంస్థలు కమిటీకి నివేదించాయి. 

ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుని పెన్షన్‌ పెంపు అంశాన్ని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, పెన్షన్‌దారులు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సంబంధిత మంత్రిత్వ శాఖ /ఇపిఎఫ్‌ఒ సామరస్యమైన పరిష్కారం చూడాలని తెలిపింది.

ఇపిఎస్‌ కింద, కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.15,000 వేతన పరిమితితో 1.16 శాతం వేతనాన్ని అందిస్తోంది. కనీస పెన్షన్‌ రూ.1,000, అసలు వ్యక్తి పెన్షన్‌ మధ్య ఉన్న మొత్తం వ్యత్యాసాన్ని కూడా తిరిగి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో చెల్లిస్తోంది. 2023 -24లో నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌ పొందుతున్న మొత్తం పెన్షన్‌ దారుల సంఖ్య 20,64,805. 

 కాగా, 2023, ఏప్రిల్‌ 1 నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు నెలకు రూ. వెయ్యి క నీస పెన్షన్‌ అందించడానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూ.957.55 కోట్లు అయినట్లు నివేదిక తెలిపింది. కార్మిక చట్టాలు ఇంకా అమలు కాలేదని నివేదిక తెలిపింది. కనీస పెన్షన్‌ను పెంచాలని  కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పెన్షన్‌ జైఘోష్‌ మహార్యాలీ సందర్భంగా నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఒపిఎస్‌) ఇండియా బ్యానర్‌ కింద ఉద్యోగులు ఆదివారం స్థానిక జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.