20 మందికి పైగా ఎంపీలకు గైరాజర్ పై బీజేపీ నోటీసులు

20 మందికి పైగా ఎంపీలకు గైరాజర్ పై బీజేపీ నోటీసులు
ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జమిలి ఎన్నికల బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెడుతుండగా అధికార బిజెపి సభ్యులు పలువురు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. సభ కు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేసినప్పటికీ మంగళవారంనాడు ఆ పార్టీకి చెందిన 20మందికి పైగా సభ్యులు లోక్‌సభకు రాలేదు. జమిలి బిల్లులను సభలో ప్రవేశపెట్టే అంశంపై చర్చ జరిగి ఓటింగ్ జరుగుతున్నప్పుడు గైర్హాజరు అయిన విషయాన్ని గుర్తించారు.

ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు బిల్లులు ఆమోదం పొందటానికి బీజేపీ ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాకపోయినా ప్రభుత్వానికి తగినంత మద్దతు లేదని విమర్శించటానికి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లు అయిందని కమలనాథులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

ఏకకాల ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం ఓటింగ్ కు పట్టుబట్టాయి.

బిల్లుపై ఓటింగ్ కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో, మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. ఓటింగ్ నిర్వహించిన సమయంలో పలువురు బీజేపీ ఎంపీలు గైర్హాజరు అయ్యారు. అందువల్ల బిల్లుపై బీజేపీకి అనుకున్న దానికంటే తక్కువ మద్దతు వచ్చినట్టు అయింది. ఇది విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది.

సభకు గైర్హాజరైన వారిలో శంతను ఠాకూర్, జగదాంబికా పాల్, రాఘవేంద్ర ద్వారా, గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, విజయ్ బఘేల్, ఉదయరాజె భోస్లే, జగన్నాథ్ సర్కార్, జయంత్ కుమార్ రాయ్ ఉన్నారు. వీరిలో కొందరు ముందుగా అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రధాని మోదీ కూడా హాజరుకానప్పటికీ ఆయన ముందుగానే విప్‌కు సమాచారమిచ్చి జై పూర్ పర్యటకు వెళ్లారు. ఇక మిగతా 20మంది ఎంపిలు సభకు రాకపోవడానికి గల కారణాలను స్వయంగా తెలుసుకున్న తర్వాత నోటీసులు జారీ చేయాలని బిజెపి అధిష్ఠానం ఆలోచనగా ఉంది.