ట్రూడోతో విభేదాలతో కెనడా ఉప ప్రధాని రాజీనామా

ట్రూడోతో విభేదాలతో కెనడా ఉప ప్రధాని రాజీనామా
కెనడా ఉప ప్రధానమంత్రి, ఆర్ధిక మంత్రి క్రిష్టియా ఫ్రీలాండ్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిగ్గా స్పందించనందుకు అసంతృప్తితో తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె  తెలిపారు.
ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్టు ట్రూడో చెప్పిన క్రమంలో తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. క్యాబినెట్‌లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆమె గుర్తింపు ఉన్నది. విధాన నిర్ణయాలకు సంబంధించి ట్రూడోకు, ఆమెకు భేదాభిప్రాయాలు తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది. 
 
దేశ ఆర్థిక సవాళ్లకు సంబంధించిన విషయాలను పార్లమెంట్‌కు వివరించాల్సిన కొద్ది గంటల ముందే ఆమె తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
‘మా దేశం ఈ రోజు తీవ్రమైన సవాల్ ఎదుర్కొంటున్నది` అని ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఫ్రీ లాండ్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.  కెనడాకు అత్యుత్తమమైన మార్గమేది అనే విషయంలో మనిద్దరి మధ్య గత కొద్ది వారాలుగా విభేదాలు నెలకొన్నాయని అంటూ ప్రధానితో తనకు గల విబేధాలను ఆమె ఆందులో పేర్కొన్నారు
 
కెనడా నుంచి చేసుకునే దిగుమతులపై 25 శాతం సుంకాలు పెంచాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేశారని గుర్తు చేశారు. `కొన్ని వారాలుగా దేశ ప్రజలకు మేలు చేసేందుకు గల అవకాశాలను కనుగొన్నాం’ అని ఆమె రాసుకొచ్చారు. ట్రంప్ సుంకాల హెచ్చరికలు చాలా తీవ్రమైనవని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. సుంకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు నిధులు నిల్వ చేసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అందుకోసం రాజకీయ జిమ్మిక్కులు చేయొద్దని హెచ్చరించారు.

అమెరికాకు కెనడా ప్రధాన వాణిజ్య భాగస్వామి. కెనడా నుంచి 75 శాతం ఎగుమతులు అమెరికాకు వెళతాయి. 2013లో తొలిసారి పార్లమెంటుకు క్రిష్టియా ఫ్రీ లాండ్ ఎన్నికయ్యారు. లిబరల్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో చేరి వాణిజ్య, విదేశాంగ శాఖలు నిర్వహించారు.  యూరోపియన్ యూనియన్, అమెరికాలతో ఫ్రీ ట్రేడ్ చర్చలు జరిపారు. ఉప  ప్రధానిగా తాను రాజీనామా చేసిన తర్వాత తనకు మరో పదవి అప్పగించాలని ట్రూడో కోరుకుంటున్నారని, కానీ, నిజాయితీగా తాను పని చేశానని, మంత్రి వర్గం నుంచి తప్పుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.