సంవత్సరం తర్వాతనే బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు

సంవత్సరం తర్వాతనే బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికలు
బంగ్లాదేశ్‌ సార్వత్రిక వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026లో జరగనున్నట్లు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. జాతినుద్దేశించి సోమవారం టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఎన్నికల తేదీలను 2025 చివరినాటికి లేదా 2026 ప్రథమార్థంలో నిర్ణయించవచ్చని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సి వుందని చెప్పారు.

 లోపరహిత ఓటరు జాబితా వంటి కనీస సంస్కరణలతో ఎన్నికలను నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు అంగీకరిస్తే 2025 నవంబర్‌ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎన్నికల సంస్కరణల పూర్తి జాబితాను క్లియర్‌ చేయాలంటే మరికొన్ని నెలలు ఆలస్యం కావచ్చని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై యూనస్‌పై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె షేక్‌ హసీనా సునాయాసంగా నాలుగోసారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 

ప్రధాని షేక్‌ హసీనా ఎన్నికలను జరిపిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత, హసీనా ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో నిలవలేదు. రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు.

 ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే యూనస్‌ కీలక ప్రకటన చేశారు.