ఇవిఎంలపై నిందలు ఆపండి.. కాంగ్రెస్ కు ఒమర్ హితవు

ఇవిఎంలపై నిందలు ఆపండి.. కాంగ్రెస్ కు ఒమర్ హితవు

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమైన ఒక భాగస్వామ్య పక్షంతో ఘర్షణకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్‌కు ఒక అంశంపై ఆక్షేపించారు. ఎలక్ట్రాక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం)ల పట్ల అదే పనిగా కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చారు. ఎన్నికల ఫలితాల విషయమై బిజెపి వాదనను ఆయన ఒక విధంగా సమర్థించారు. 

కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎన్నికల ఫలితాలను ఆమోదించడం, ఓడినప్పుడు ఇవిఎంలను నిందించడం తగదని ఒమర్ సున్నితంగా మందలించారు. ‘అవే ఇవిఎంలను ఉపయోగించి వంద మందికి పైగా పార్లమెంట్ సభ్యులను మీరు పొందినప్పుడు దానిని మీ పార్టీ విజయంగా వేడుక చేసుకుంటుంటారు. కొన్ని నెలలు గడచిన తరువాత ఎన్నికల ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోతే మాకు ఆ ఇవిఎంలు అంటే ఇష్టం లేదని అంటుంటారు’ అని ఒమర్ అబ్దుల్లా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఎద్దేవా చేశారు.

బిజెపి అధికార ప్రతినిధి వలె కనిపిస్తున్నారని అన్నప్పుడు ‘భగవంతుడు క్షమించుగాక’ అని ఒమర్ స్పందించారు. ‘లేదు. అది అంతే. ఏది సరైనదో సరైనదే’ అని ఆయన పేర్కొన్నారు. పక్షపాతంతో కూడిన విధేయతతో కాకుండా సిద్ధాంతాల ప్రాతిపదికపైనే తాను మాట్లాడుతుంటానని ఆయన చెప్పారు. 

‘సెంట్రల్ విస్టా’ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు తన మద్దతును తన స్వతంత్ర ఆలోచనలకు ఒక ఉదాహరణగా ఒమర్ పేర్కొన్నారు. ‘ఇతరులు అభిప్రాయానికి భిన్నంగా, ఢిల్లీలో ఆ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వల్ల ఒనగూరుతున్నది చాలా మంచి విషయమని నా భావన. మనకు పార్లమెంట్ కొత్త భవనం అవసరం. పాత భవనం అవసరానికి మించి ఉపయోగపడింది’ అని ఆయన తెలిపారు.

వోటింగ్ యంత్రాంగాన్ని విశ్వసించనప్పుడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఇవిఎంలపైనే దృష్టి కేంద్రీకరించడం ద్వారా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ గింజుకుంటున్నాయని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఒమర్ సమాధానం ఇస్తూ, ‘మీకు ఇవిఎంలతో సమస్యలు ఉన్నట్లయితే, ఆ సమస్యలపై మీరు నిలకడగా ఉండాలి’ అని సూచించారు. 

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్ ఇవిఎంల లోపం, ఎన్నికల ఫలితంపట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. ఎన్నికల్లో తిరిగి బ్యాలట్ పత్రాలు ఉపయోగించాలని ఆ పార్టీ కోరింది. జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తాము పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పట్ల నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అసంతుష్టికి ఒమర్ తాజా వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. 

ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ఇవిఎంలు ఒకే విధంగా ఉంటాయని, పార్టీలు ఓటమికి ఒక సాకుగా వాటిని వాడుకోరాదని ఒమర్ స్పష్టం చేశారు. ‘వోటర్లు ఒక రోజు మిమ్మల్ని ఎంచుకోవచ్చు. ఆ మరునాడు వారు అలా చేయకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. సెప్టెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము మెజారిటీ సాధించగా లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ‘నేను ఇవిఎంలను ఎన్నడూ తప్పు పట్టలేదు’ అని ఒమర్ చెప్పారు.