శ్రీలంక భూభాగంలో భారత్ కు హానికరం అనుమతించం

శ్రీలంక భూభాగంలో భారత్ కు హానికరం అనుమతించం
భారతదేశానికి హాని కలిగించే ఎటువంటి కార్యకలాపాలకు తమ దేశ భూభాగాన్ని ఉపయోగించబోమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే స్పష్టం చేశారు. భారత దేశ అధికార పర్యటనకు వచ్చిన ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఆయన మాట్లాడారు. హైదరాబాద్ హౌస్‌లో ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. 
 
రెండు సంవత్సరాల క్రితం శ్రీలంక “అపూర్వమైన ఆర్థిక సంక్షోభం” ఎదుర్కొన్న సమయంలో సహాయం చేసినందుకు భారతదేశానికి దిస్సనాయకే కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం సుమారు 4 బిలియన్ డాలర్ల విలువైన క్రెడిట్ లైన్లు, గ్రాంట్‌ల ద్వారా శ్రీలంకకు మద్దతు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. పొరుగు దేశంలో “సయోధ్య, పునర్నిర్మాణం” గురించి చర్చించామని పేర్కొంటూ శ్రీలంక ప్రభుత్వం తమిళ మైనారిటీల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఇరుదేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత విస్తరించుకోవాలని భారత్‌, శ్రీలంక నిర్ణయించుకున్నాయి. త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, మల్టీ-ప్రొడక్ట్‌ పెట్రోల్ పైప్‌లైన్‌లను ఏర్పాటుచేసి ఇంధన సంబంధాలను కూడా పెంచుకోవాలని భావిస్తున్నాయి.

‘భారత్‌-శ్రీలంకల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పెట్టుబడి ఆధారిత వృద్ధి అవసరమని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఫిజికల్, డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు ద్రవీకృత సహజ వాయువు (లిక్విఫైడ్‌ నేచురల్ గ్యాస్‌)ను సరఫరా చేస్తామని మోదీ చెప్పారు. భారత్‌-శ్రీలంకల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం – తలైమానార్‌ మధ్య ఫెర్రీ సర్వీస్‌లను ప్రారంభించున్నట్లు మోదీ ప్రకటించారు.

‘ఇరుదేశాల భద్రతా ప్రయోజనాలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసుకోవాలని మేము నిర్ణయించాం. ఇప్పటికే హైడ్రోగ్రఫీ సహకారం కోసం ఒప్పందం కుదిరింది’ అని మోదీ చెప్పారు.  ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మధ్య మత్స్యకారుల సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చాయి.

“శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, ఇదే నా మొదటి విదేశీ పర్యటన. భారత్‌లో పర్యటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ సర్వీస్‌లను డిజటలైజ్ చేయడంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీలంక కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ ప్రయత్నంలో శ్రీలంకకు భారత్‌ మద్దతుగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు” అని అనుర కుమార దిసనాయకే తెలిపారు.

విదేశాంగ మంత్రి జైశంకర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ లో భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానం, సాగర్‌ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని, ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 

విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే తెలిపారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు.