అక్టోబర్ 2026 నాటికి పోలవరం పూర్తి

అక్టోబర్ 2026 నాటికి పోలవరం పూర్తి

2026లోగా ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి చేసేలా కార్యాచరణ పెట్టుకున్నామని, పోలవరం ప్రాజెక్ట్ ను 2026 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2026 జూన్‌లోగా ఈసీఐఆర్ గ్యాప్‌-2 పనులు, 2026 జూన్‌లోగా అప్రోచ్ ఛానల్ పనులు, 16 వేల 400 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.

‘‘వచ్చే ఏడాది జనవరి 2 న డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తాం. 2026 మార్చి నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతాయని అధుకారులు చెబుతున్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాలి అని నేను చెప్పను. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు. ఇంకా ముందే పూర్తి చేయాలని అధికారులకు చెప్పా. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అంటున్నాను” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

 

“ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌ను 2026 నాటికి పూర్తి చేస్తాం. ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానం జరగాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

ఐఐటీహెచ్‌ వాళ్లు వచ్చి డయాఫ్రం వాల్‌పై వాస్తవాలు చెప్పారని, పోలవరం ఇప్పటి వరకు 76.79 శాతం పనులు పూర్తయ్యిందని వెల్లడించారు. కేంద్రం రూ.12,157 కోట్లకు అనుమతి ఇచ్చిందని, లెఫ్ట్ కెనాల్‌ను అనకాపల్లి వరకు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఏ పని ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టంగా చెప్పేందుకే వచ్చానన్న సీఎం, దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

 

కాగా, రెండోదశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని, నదుల అనుసంధానం దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరతామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎత్తుపై స్పష్టమైన కార్యాచరణ దిశగా ముందుకెళ్తామని చెబుతూ  పోలవరం వల్ల 7.20 లక్షలఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని వెల్లడించారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని  వివరించారు.

పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామన్న సీఎం, గొల్లాపల్లి రిజర్వాయర్‌ వస్తే చాలావరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని, అక్కణ్నుంచి బనకచర్లకు తీసుకెళ్లొచ్చని చెప్పారు. నేరుగా విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు వెళ్తుందని, ఇవి పూర్తిచేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని పేర్కొన్నారు.