రేపే లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

రేపే లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
 
* అవసరమైతే అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు జరిపే అవకాశం!
 
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 
 
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్  129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నారు.  వాస్తవానికి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాలు (సవరణ బిల్లు)ను సోమవారం సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి.
 
అయితే తాజాగా రివైజ్‌ చేసిన లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో వీటిని తొలగించారు. లోక్‌సభ కార్యదర్శి విడుదల చేసిన రివైజ్డ్‌ జాబితాలో సోమవారం ఈ రెండు బిల్లులకు సంబంధించిన అజెండాను పెట్టలేదు. దీంతో ఈ బిల్లులు నేడు సభ ముందుకు రాలేదు. మంగళవారం ఈ బిల్లులు లోక్‌షభ ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.

అయితే జమిలి ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్ సభతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులకు సంబంధించిన నిబంధన ఒకటి ఉంది. సెక్షన్ 2 సబ్ క్లాజ్ 5 ప్రకారం లోక్​సభతో పాటు ఏదైనా శాసనసభకు ఎన్నికలు నిర్వహించలేమని ఈసీ అభిప్రాయపడితే తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరపవచ్చు. 

శాసనసభ ఎన్నికలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి. ఈ క్రమంలో రాష్ట్రపతి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది.

పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికరణం 83, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు అధికరణం 172, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం 327 సవరించాల్సి ఉంటుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు తర్వాత లోక్​సభ మొదటి సమావేశం జరిగే తేదీపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ నోటిఫికేషన్ తేదీని అపాయింటెడ్ డేట్ అంటారు. ఆ నిర్ణీత తేదీ నుంచి లోక్​సభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.

జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్నవేళ దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్‌ ఓం బిర్లాను కేంద్రమంత్రి అభ్యర్థించనున్నారు. అనంతరం దీనిపై ప్యానెల్‌ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని సభాపతి పార్టీలను కోరనున్నారు. సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది.

పార్లమెంట్​లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు దక్కుతుంది. అంటే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీ ఛైర్మన్‌ గా ఉంటారు. తొలుత ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల సమయం కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని పొడిగించొచ్చు.