తిరుమల లడ్డు కల్తీపై సిట్ మధ్యంతర నివేదిక సిద్ధం!

తిరుమల లడ్డు కల్తీపై సిట్ మధ్యంతర నివేదిక సిద్ధం!
తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణ కీలక దశకు చేరుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. తిరుపతిలోనే మకాం వేసి సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. లడ్డూ తయారీ కేంద్రం మొదలు..నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక నివేదిక సిద్దం సిట్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది

సంచలనం రేకెత్తించిన తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే సీబీఐ జేడీ నేతృత్వంలోని ఏర్పాటైన సిట్ వేగవంతం చేసింది. తిరుమలలో లడ్డూ తయారీ పోటును పరిశీలించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు – కాంట్రాక్టర్ల ఖరారు పైన ఆరా తీసింది.
 
తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను పరిశీలించింది. ఏఆర్ డెయిరీలో విచారణ చేసింది. కొన్ని ఫైల్స్ ను స్వాధీనం చేసుకుంది. అక్కడి సిబ్బందిని విచారణ చేసింది. నెయ్యి సరఫరా చేసిన సమయంలో లారీల డ్రైవర్ల విచారణకు సిద్దమైంది.ఇప్పటి వరకు విచారణ లో వెలుగులోకి వచ్చిన అంశాలను టీం సభ్యులు సీబీఐ ఉన్నతాధికారుల కు నివేదించారు. 
 
తిరుపతి కేంద్రంగా సిట్ తమ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సిట్ చీఫ్ వీరేష్ ప్రభు, మురళి రంభలు శ్రీవారి ఆలయంలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో శ్యామల రావుతో సమీక్ష నిర్వహించారు. 
 
ఇక భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సిట్ ఆఫీస్ కు పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. అనుమతి లేనిదే ఎవరినీ భూదేవి కాంప్లెక్స్ లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది.నెయ్యి సరఫరాలో లోపాల పైన ప్రాధమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
అదే విధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలే సరఫరా చేసాయా.. మధ్యలో ఇతర కంపెనీల జోక్యం ఉందనే ఆరోపణల పైన చెక్ పోస్టుల నుంచి సమాచారం సేకరించారు. అదే విధంగా తిరుమలకు చేరిన నెయ్యి శాంపిల్స్ లాబ్ లో ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు. నాణ్యత ఏమేర నిర్ధారణ అవుతుందనే అంశాలను పరిశీలించారు.  ఇక, తిరుపతిలో మకాం వేసిన సిట్ టీం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరాలు తెలిపారు.