ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఉపాధిహామీ వేతనాలు

ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఉపాధిహామీ వేతనాలు
 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద కార్మికులకు తక్కువ వేతనాలను ఇస్తున్నారని పార్లమెంటరీ కమిటీ ఎత్తిచూపింది. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఉపాధిహామీ వేతనాల రేట్లను కూడా పెంచాలని, అందుకు తగ్గట్టుగా గ్రామీణాభివృద్ధి శాఖ వేతనాల సూచికలో మార్పులు చేయాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. 
 
ఈ సందర్బంగా ‘పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతోంది. ఈ తరుణంలో చాలా రాష్ట్రాల్లో ఎంజిఎన్‌ఆర్‌జిఇజిఎ కింద రోజువారీ వేతనం రూ. 200 గానే ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్న అదే రాష్ట్రంలో లేబర్‌ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఉపాధి వేతనం మాత్రం పెరగలేదు’ అని కాంగ్రెస్‌ ఎంపి సప్తగిరి శంకర్‌ ఉలక నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి ప్యానెల్‌ పేర్కొంది. 
 
ద్రవ్యోల్బణానికి తగినట్టుగా ఎంజిఎన్‌ఆర్‌జిఎ కూలీల వేతనాలు లేవు. వాటిని పెంచలేదు. ఈ పథకం కింద కూలీ పనికివచ్చే వివిధ వర్గాల వారు వేతనం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేతనాలకు సంబంధించి పున:సమీక్షించుకుని ఈ పథకం కూలీలకు వేతనాలను పెంచడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని డిఓఆర్‌డి (గ్రామీణాభివృద్ధి శాఖ)ని పార్లమెంటరీ కమిటీ కోరింది. 
 
వివిధ రాష్ట్రాల్లో వేతనాల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయని ఈ కమిటీ పేర్కొంది. పురుషులతో సమానంగా స్త్రీలకు సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్రం దాన్ని అనుసరించాలని రాజ్యాంగంలోని ఆర్టిక్‌ 39లోని క్లాజ్‌ (డి) నిబంధన పేర్కొంటోంది. ఆర్టికల్‌ 39 నిబంధన ప్రకారం ఎజిఎన్‌ఇఆర్‌జిఎ పథకం కింద వివిధ రాష్ట్రాలకు వేర్వేరు వేతనాలు ఉండకూడదు. 
 
ఈ నిబంధన ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పథక లబ్దిదారులకు అసమానతలు లేని వేతనాలు చెల్లించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పథకం కింద ఆర్థిక నిర్వహణ, వేతనాలు, కూలీలకు అందించే మెటీరియల్స్‌లోనూ మరింత మెరుగ్గా ఉండాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. వంద రోజుల పనిదినాలను 150 రోజులకు పెంచాలని కమిటీ సూచించింది.