
1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ హరించారని, దేశాన్ని జైలుగా మార్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభ లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని సమాధానం ఇస్తూ ‘రాజ్యాంగం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు చిరిగిపోయింది. నాడు (1975లో) ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగ హక్కులన్నీ హరించబడ్డాయి. దేశాన్ని జైలుగా మార్చారు’ అని మోదీ మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం అవమానించిందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని విమర్శించారు. ప్రజల మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందని వ్యాఖ్యానించారు. దళిత నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, ఆయనను బాత్రూమ్లో బంధించిందని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ విధించి వేల మందిని జైళ్లకు తరలించారని ఆరోపించారు.
నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించారని మండిపడ్డారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో 55ఏళ్లు దేశాన్ని ఒకే కుటుంబం పాలించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి నీచ రాజకీయాల గురించి దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని చెబుతూ రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుటుంబం ఏ రాయిని వదిలిపెట్టలేదని ఆయన ధ్వజమెత్తారు.
ఆచార్య కృపలానీ, జయప్రకాష్ నారాయణ వంటి నేతల సలహాల్ని కూడా నెహ్రూ పట్టించుకోలేదని ప్రధాని విమర్శించారు. “మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదు” అంటూ ధ్వజమెత్తారు.
“1947 నుంచి 1952 వరకు ఎన్నికైన ప్రభుత్వం మనకు లేదు. ఆ సమయంలో ఆ కుటుంబం ఈ దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు. ఆయన తప్పు చేస్తున్నారని అప్పటి స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎంతోమంది పెద్దలు సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేకసార్లు ప్రయత్నించారు” అని మోదీ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యాన్ని 1950లో పుట్టిన భావనగా చూడలేదని మోదీ తెలిపారు. వేల సంవత్సరాల పాటు భారత దేశ గొప్ప వారసత్వం నుండి వారు ప్రేరణ పొందారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ప్రజాస్వామ్యం అప్పటివరకూ తెలియదన్నారని, కానీ భారతదేశానికి ప్రజాస్వామ్య సంప్రదాయాలు చాలా కాలంగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ చట్రం భారతదేశానికి పరాయిది కాదన్న తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల్ని గుర్తుచేశారు. రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది చురుకైన మహిళా సభ్యులు ఉన్నారని, వారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో గణనీయంగా సహకరించారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభంలోనే మహిళలకు ఓటు హక్కును కల్పించడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు.
లింగ సమానత్వానికి దేశం యొక్క నిబద్ధతను గుర్తుచేసిన ప్రధాని మోదీ భారతదేశం మహిళల నేతృత్వంలోని అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందని తెలిపారు. రాష్ట్రపతి ముర్ము ఎన్నికను దీనికి ఉదాహరణగా చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో భాగస్వాములయ్యేలా దేశ ప్రజలకు తగిన స్ఫూర్తి అందించామని పేర్కొన్నారు.
భారతదేశ వ్యవస్థాపక నాయకుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి రాజ్యాంగ సభ సభ్యులు వచ్చారని, భిన్నత్వంలో దేశం యొక్క ఏకత్వానికి ప్రతీకగా దీన్ని మోదీ పేర్కొన్నారు. భారత దేశ ఐక్యతకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశామని పేర్కొంటూ ప్రస్తుతం జమిలి ఎన్నికలను కూడా దేశ ఐక్యతా ప్రయత్నాల్లో భాగంగానే చూస్తున్నామని స్పష్టం చేశారు.
“ఈ దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డాం. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు” అని మోదీ తెలిపారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి