భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

భారత్‌పై కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్న కెనడా ఇప్పుడు ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై పడింది. కీలక డాక్యుమెంట్లను మరోసారి తమకు సమర్పించాలని పేర్కొంటూ  కెనడా ఇమ్మిగ్రేషన్‌, రిఫ్యూజీస్‌, సిటిజన్‌షిప్‌ కెనడా (ఐఆర్‌సీసీ) ఈ మెయిళ్ల ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీనితో కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

రెండేళ్ల గడువుతో వీసాలు ఉన్న చాలా మంది విద్యార్థులకు ఈ ఈ-మెయిల్స్‌ గుబులు రేపినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. వీటిలో అధ్యయన అనుమతులు, విసాలు, ఎడ్యుకేషనల్‌ రికార్డులు, మార్కులు, అటెండెన్స్‌ వంటి పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఐఆర్‌సీసీ ఆదేశాలతో భారత విద్యార్థులు సహా అంతర్జాతీయ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

ఇప్పుడు డాక్యుమెంట్లను అడ్డుపెట్టుకుని ఎదైనా మెలిక పెట్టి తమ వీసాలను రద్దు చేస్తారేమోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల రాకను క్రమబద్ధం చేసేందుకు ఎస్‌డిఎస్‌ పేరిట తన ఫాస్ట్‌ ట్రాక్‌ స్టడీ వీసా ప్రోగ్రామ్‌ను ఐఆర్‌సీసీ ముగించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అవసరమైన అర్హతలను కూడా కొద్దిగా కఠినతరం చేయనున్నట్లు కెనడా అప్పటికే ప్రకించింది.

ఐఆర్‌సీసీ వాదన మరో విధంగా ఉంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల ప్రవేశాలను నియంత్రించాలని నిర్ణయించినట్టు తెలిపింది. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. కెనడాలో 4.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. మరోవైపు, అమెరికాలోనూ సరైన ధ్రువపత్రాలు లేని 18 వేల మంది భారతీయ విద్యార్థులను దేశం నుంచి పంపించేందుకు రంగం సిద్ధం  అవుతున్నట్టు తెలిసింది. 

వీరిలో గుజరాత్‌, పంజాబ్‌, ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇమిగ్రేషన్‌ అధికారుల కథనం ప్రకారం ఈ ఏడాది నవంబరు నాటికి 14.45 లక్షల మంది విద్యార్థులను అమెరికా నుంచి పంపేయాలని నిర్ణయించుకున్నారు. వీరిలో 17,940 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

గతవారం కూడా ఇటువంటి పరిణామాలు కొన్ని చోటుచేసుకున్నాయి. పంజాబ్‌కు చెందిన విద్యార్థులకు కూడా ఈ తరహా ఈ-మెయిల్స్‌ అందాయి. తమ గుర్తింపును నిరూపించుకునేందుకు ఐఆర్‌సీసీ కార్యాలయాన్ని సందర్శించాలని కూడా వారికి ఆదేశాలు వెళ్లాయి. తాజా పరిణామాల పట్ల భారతీయ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 కాగా, కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ అక్టోబర్‌ 24న తమ కొత్త ఇమిగ్రేషన్‌ వ్యూహాన్ని వివరిస్తూ 2025లో కెనడా సుమారు 3.95 లక్షల మందిని పర్మనెంట్‌ రెసిడెంట్స్‌గా చేర్చుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది 4.85 లక్షల మందిని చేర్చుకుంటారని అంచనా ఉండగా ఆయన లెక్క ప్రకారం 20 శాతం తగ్గే అవకాశం ఉంది.