ట్రంప్ రాకతో 18 వేలమంది ప్రవాస భారతీయులు వెనక్కు!

ట్రంప్ రాకతో 18 వేలమంది ప్రవాస భారతీయులు వెనక్కు!
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల హామీ మేరకు లక్షలాది మంది అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికా నుంచి పంపించాల్సిన 15 లక్షల మంది జాబితాను యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సిద్ధం చేసింది. నవంబర్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు ఉన్నారు. 
 
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను వెనక్కు పంపడానికి అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని చేపడతానని ట్రంప్‌ హామీ ఇచ్చారు.  జనవరి 20న ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన  తర్వాత అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపించే చర్యలను అమెరికా ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. 
 
కాగా, ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ అనే సంస్థ డాటా ప్రకారం అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో మెక్సికో, ఎల్‌ సాల్వడర్‌ దేశాలకు చెందిన వారి తర్వాత భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 90 వేల మంది భారతీయులు అక్రమంగా అమెరికా సరిహద్దు దాటే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి చిక్కారు.అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు భారతీయ వ్యవస్థల నుంచి ఆలస్యం జరుగుతున్నదని పేర్కొన్న యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ)  భారత్‌ను ‘సహకరించని దేశం’ విభాగంలో చేర్చింది. అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపే క్రమంలో సహకరించని, వారిని దేశంలోకి అనుమతించని దేశాలను ఈ జాబితాలో ఐసీఈ చేరుస్తున్నది. ఇప్పటివరకు భారత్‌, చైనా, పాకిస్థాన్‌ సహా 15 దేశాలను ఈ జాబితాలో చేర్చింది.

అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఇతర దేశాలకు చెందిన నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ వీసాల కోసం అమెరికాలోని కంపెనీలు ముందుగా పిటిషన్లు పెట్టుకుంటే ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. గత కొన్నేండ్లుగా భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్‌-1బీ వీసా అప్రూవల్స్‌ తగ్గిపోతున్నాయి.

అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలకు 2015 ఆర్థిక సంవత్సరంలో 14,792 హెచ్‌-1బీ వీసాలకు ఆమోదం రాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7,299 మాత్రమే వచ్చాయి. అధికారిక డాటాను విశ్లేషించిన అమెరికాకు చెందిన నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ(ఎన్‌ఎఫ్‌ఏపీ) అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఇచ్చిన మొత్తం హెచ్‌-1బీ వీసా అప్రూవల్స్‌లో ఏడు ప్రధాన భారతీయ సంస్థలకు దక్కింది కేవలం 5.2 శాతం మాత్రమే.