ప్రజలకు మోసపూరిత హామీలివ్వడమే కాంగ్రెస్‌ నైజం

ప్రజలకు మోసపూరిత హామీలివ్వడమే కాంగ్రెస్‌ నైజం
 
* తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
 
ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి, మభ్యపెట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని దించేవరకు బీజేపీ కార్యకర్తలు పోరాడుతారని హెచ్చరించారు. తెలంగాణలో ఏడాదిగా ఉన్న ప్రభుత్వం మోసాలను, అబద్ధాల పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు తాను వచ్చానని తెలిపారు.
 
`కాంగ్రెస్ పార్టీ 6 అబద్దాలు, 66 మోసాలు’ పేరుపై రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ  తెలంగాణతోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. హిమాచల్‌లో కార్మికులకు పాత పింఛను పథకం, ఐదు లక్షల ఉద్యోగాలని చెప్పి మోసగించిందని, కర్ణాటకలో అంగన్‌వాడీలకు రూ.15 వేలు ఇస్తామని మోసం చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, రైతులకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అందుకే వీరిని తాను మాయలోళ్లని అంటున్నానని ఎద్దేవా చేశారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 ఇస్తామన్న హామీ, షాదీ ముబారక్‌, తులం బంగారం, లక్ష రూపాయల నగదు ఏమైందని ప్రశ్నించారు. 

అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటూ అధికారంలో ఉన్నంతకాలం అప్పులతో నడిపిద్దామని, ఆ తర్వాత సంగతి తర్వాత అన్నట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ధోరణి ఉందని విమర్శించారు. తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు గ్రాంట్‌గా ఇచ్చామని నడ్డా తెలిపారు. స్మార్ట్‌ సిటీలు వరంగల్‌, కరీంనగర్‌లకు రూ.27 వేల కోట్లు కేటాయించామని, వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, రైల్వేలకు ఆర్థిక సహకారం అందించామని చెప్పారు. 

మూడు వందేభారత్‌ రైళ్లు, జాతీయ రహదారులు, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ వంటి ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దక్కిన ప్రజాదరణే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్ షేర్ చాలా తక్కువ వచ్చిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అని స్పష్టం చేశారు. కేంద్రంలో విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ మూడోసారి మోదీనే గెలిపించారని నడ్డా గుర్తు చేశారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం వింటూ వచ్చాం, కానీ మోదీ పాలనలో ఇంతవరకు ఆ మాట రాలేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి అని, ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం అని ఘాటుగా విమర్శలు చేశారు. అంతేగాక బీజేపీతో నేరుగా పోటీలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఓటమి చెందిందని, ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుందన్న విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 

తెలంగాణ బీజేపీ రైతులు, మహిళలు, యువకులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించిందని నడ్డా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయం, అబద్ధాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తెలంగాణ బీజేపీ నడుం బిగించిందని చెప్పారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా, 6 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని నడ్డా గుర్తు చేశారు.

తెలంగాణలో బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక శాశ్వతంగా అధికారంలోనే ఉంటుందని, ఈ మేరకు రాష్ట్రంలో కమలాన్ని వికసింపజేయాలని కార్యకర్తలకు చెబుతూ  భవిష్యత్తులో తెలంగాణలోనూ కమలాన్ని వికసింప చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో ఆరు, గోవా 3, మధ్యప్రదేశ్ లో 3, యూపీలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేశారు.

మహారాష్ట్రలోనూ మూడోసారి అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో రెండు, మణిపూర్‌లో మూడు, అసోంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చామని చెబుతూ ఒక్కసారి కాదు ఎన్నోసార్లు గెలుపు రికార్డులు బిజెపికి ఉన్నాయని నడ్డా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని, ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందని నడ్డా వివరించారు. చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో 64 సీట్లపై బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరగ్గా ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు.