ఏడాదిలోనే వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగు

ఏడాదిలోనే వైఫల్యాలు, హామీల అమలులో వెనకడుగు

ఎటువంటి పరిపాలన అనుభవం లేకుండా, కాంగ్రెస్ పార్టీలోని హేమాహేమీలను పక్కకు నెట్టివేసి, మరో పార్టీ నుండి వచ్చినప్పటికీ ఏకంగా ముఖ్యమంత్రి పదవి సంపాదించగలిగిన రేవంత్ రెడ్డి పాలనలో ఆ దూకుడు, వేగం చూపించలేక పోయారు. పదేళ్ల బిఆర్ఎస్ నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగించి, ప్రజాపాలన  అందిస్తానని చెప్పి అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే అధికారంలోకి వచ్చిన అతి త్వరలోనే ప్రజా విశ్వాసం కోల్పోయారు.

ఎన్నికల ముందు చేసిన హామీలను గాలికి వదిలేసి, గత ప్రభుత్వ అవినీతి, అక్రమాల అంతు చూస్తానని చెప్పిన మాటలను మరిచిపోయి, మరిన్ని అవినీతి ఆరోపణలతో సరికొత్త చరిత్ర సృష్టించడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నే భగ్నం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ఏడాది పాలనలోనే ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల విసిగిపోయి, ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

కూల్చివేతలు, భూములు లాక్కోవడమే అజెండాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేయడం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండడం వల్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పైగా, తన ప్రభుత్వంపై విమర్శలకు సావధానంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం, ఎదురు దాడి చేయడం, దారిమల్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దానితో మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు ప్రజల మధ్యలోకి స్వేచ్ఛగా వెళ్లలేని పరిష్టితులు నెలకొన్నాయి. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, వారి సాధక బాధకాలు వింటానని చెప్పిన ఆయన ఇంటి చుట్టూ గత ముఖ్యమంత్రి మాదిరిగా పోలీస్ వలయం ఏర్పరచుకున్నారు. రాష్ట్ర సచివాలయంకు సహితం గత ముఖ్యమంత్రి మాదిరిగా అందరూ రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టే ప్రభుత్వం కాదని, పేదల ఇండ్లు కూల్చే ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది.  ఎప్పుడు తమ ఇండ్లు కూల్చుతారో, భూములు లాక్కుంటారోననే భయంతో ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.  పేదల భూములు గుంజుకునే ప్రభుత్వంగా ముద్రపడింది తప్ప పేదల అవసరాలు తీర్చే ప్రభుత్వంగా పేరుతెచ్చుకోలేకపోతుంది.

హైడ్రా పేరుతో ప్రజలను భయకంపితులను చేయడం తప్ప చేసిందేమిటో చెప్పుకోలేకే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. మూసి ప్రక్షాళన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హడావుడి తప్ప మరేమీ కనిపించడం లేదు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించి నిలిచినా మొండిగా ముందుకెళుతున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములను ఆయా రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన సంగతిని మరిచిపోయి ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా ఫోర్త్ సిటీ పేరుతో మరో 16 వేల ఎకరాలను సేకరించాలని ప్రయత్నిస్తున్నది. అందుకోసం రైతులు, పేదల భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. 

తన సొంత నియోజకవర్గం భూములను బలవంతంగా లాక్కొని ప్రయత్నాన్ని లగచర్లలో రైతులు వ్యతిరేకిస్తే పోలీసులను ప్రయోగించారు. కనీసం వారిని నచ్చచెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం లేదు. అంతలో మాట మార్చి ఫార్మా విలేజ్ కాదని, పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నాను అంటూ చెబుతున్నారు. ఇదంతా సొంత వారికి మేలు చేసేందుకే అని ఆరోపణలు వెలువడుతున్నాయి.

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదు. ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న హామీ, రూ.500కి వంట గ్యాస్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. రూ.4 వేల నెలవారీ పింఛన్ మొదలుకుని ఇచ్చిన హామీలన్నింటికి ఎగనామం పెడుతున్నారు. రుణమాఫీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో కొందరికి మాత్రమే రుణ మాఫీ జరిగిందని, మిగిలిన చాలా మందికి రుణమాఫీ జరగనేలేదు. 

 
ఇక రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలైతే ఒక్కటీ అమలు కాలేదు.  రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వడ్లకు రూ.500 బోనస్ హామీల అమలుకు అతీగతి లేకుండా పోయింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఎంతమందికి అమలు చేస్తున్నారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ఇచ్చిన హామీ ముచ్చటే లేకుండా పోయింది. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీ గురించి ఇప్పుడు మాట్లాడటమే లేదు. 
తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒక అలజడి సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల కారణంగానే మహారాష్ట్ర ఎన్నికల్లో చాము కెహెవుదెబ్బ తిన్నామని కాంగ్రెస్ కేంద్ర పెద్దలు, ఆ రాష్ట్రంలోని నాయకులు వాపోతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ఆ పార్టీ వారే రేవంత్ రెడ్డి పాలనా పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి అవుతుంది.