మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్షాలు

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్షాలు
మహారాష్ట్రలో శనివారం నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు (మహా వికాస్‌ అఘాడీ కూటమి) బహిష్కరించారు. ఈ మూడు రోజుల సమావేశాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతోపాటు, స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. 
 
శనివారం ఉదయం ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్‌, శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్‌పవార్‌) పార్టీల ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఈ సమావేశాల్లో మొదటగా బిజెపి ఎమ్మెల్యే చైన్‌ సుఖ్‌ సంచేతి ప్రమాణస్వీకారం చేశారు. ఈయన ప్రమాణస్వీకారం తదనంతరమే మహా వికాస్‌ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపలికి వచ్చి ఆందోళనలు చేపట్టారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఇవిఎంలలో అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. ఈరోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌పవార్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటేల్‌ను ప్రమాణస్వీకారానికి పిలవగా ఆయన హౌస్‌ నుంచి బయటకొచ్చేశారు. 
 
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులందరూ విధాన్‌ భవన్‌ ఆవరణలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివసేన (యుబిటి) ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఈరోజు జరిగే ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేంతా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. ఇవిఎంల సహాయంతోనే ఈ కూటమి గెలిచింది. ఈ ఎన్నికల్లో ఇవిఎంల వినియోగానికి నిరసనగా మొదటి రోజు ప్రమాణస్వీకారం చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము’ అని ఆయన తెలిపారు.
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 235 స్థానాలను మహాయతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ లు కూడా ప్రమాణం చేశారు. అంతకుముందు విధాన్‌ భవన్‌ కాంప్లెక్స్‌ ఆవరణలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.