సిరియాలో భారతీయులంతా స్వదేశం వచ్చేయాలి

సిరియాలో భారతీయులంతా స్వదేశం వచ్చేయాలి
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. 
 
ఒకవేళ రాలేనివారు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని తెలిపింది. భద్రత గురించి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం +963993385973, hoc.damascus@mea.gov.inను సంప్రదించాలని పేర్కొన్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్రావెల్‌ అడ్వైజరీ జారీచేసింది.

అదేవిధంగా ప్రభుత్వ తదుపరి నోటిఫికేషన్‌ జారీచేసే వరకు భారత పౌరులెవరూ సిరియా వెళ్లొద్దని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అక్కడ ఉంటే తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. వీలైన త్వరగా అందుబాటులో ఉన్న విమానాల్లో వచ్చేయాలని తెలిపింది. రావడం కుదరనివారు డమాస్కస్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.

కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘హయత్‌ తహ్రీర్‌ అల్‌-షామ్‌’ ఇస్లామిక్‌ గ్రూపునకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు సిరియాలో రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పోలో భీకర దాడులకు దిగారు. 

బుధవారం నుంచి ప్రారంభమైన ఈ దాడుల్లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ నేతృత్వంలోని ప్రభుత్వ సేనలను వెనక్కి నెడుతూ అలెప్పో విమానాశ్రయంతోపాటు ఆ నగరంలో సగానికిపైగా ప్రాంతాన్ని, ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని మరాత్‌ అల్‌ నమన్‌ నగరాన్ని, అనేక పట్టణాలను, గ్రామాలను స్వాధీనం చేసుకున్నారు. 

దీంతో సిరియా ప్రభుత్వ దళాలకు రష్యా అండగా నిలిచింది. తిరుగుబాటుదారులపై భీకర స్థాయిలో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 300 మందికిపైగా తిరుగుబాటుదారులు హతమయ్యారని ‘టాస్‌’ వార్తా సంస్థ వెల్లడించింది. 2011లో కొందరు ప్రజాస్వామ్య అనుకూల వాదులు సిరియా అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ వీధులలో ప్రదర్శనలను చేశారు. 

ఈ అంతర్యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న అసద్‌ ప్రభుత్వ దళాలు వారి ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేశాయి. అయితే చిన్న ఆర్గానిక్‌ మిలీషియాలు, సిరియన్‌ మిలిటరీ నుంచి వచ్చిన కొందరితో కలిసి ఒక సాయుధ ప్రతిపక్షం ఏర్పడటం ప్రారంభించింది. ఈ సంస్థల ఆలోచనలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నప్పటికీ అసద్‌ను దించేయాలన్న ఏకైక లక్ష్యం వారిని ఒక్కటి చేసింది. 

దానికి తోడు వీరికి పొరుగున ఉన్న టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు అమెరికా కూడా వివిధ మార్గాల్లో సహకారం అందించేవి. వీరి కార్యకలాపాలు పెరుగుతుండటంలో అప్రమత్తమైన సిరియా రష్యా, ఇరాన్‌ లాంటి మిత్రదేశాలతో బంధం మరింత బలోపేతం చేసుకుంది. 

సహజంగానే జిహాదీల ప్రమేయాన్ని సిరియా ఇష్టపడేది కాదు. దాంతో ఇస్లామిక్‌ సంస్థలు ఆ దేశాన్ని టార్గెట్‌ చేయడం ప్రారంభించాయి. 2014 నాటికి తిరుగుబాటుదారులు దేశంలోని పలు ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. 2016 నాటికి రష్యా, ఇరాన్‌ మద్దతుతో సైనిక తిరుగుబాటుదారులను సిరియా పూర్తిగా అణచివేసి అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకుంది.