
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువారం ప్రకటించింది. కొత్త నిబంధనలు చాలావరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలను పోలి ఉన్నాయి.
ముందు చదివిన కోర్సుతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సును డిగ్రీ, పీజీలో ఎంచుకునే వీలు కల్పించింది. పలు దేశాల్లో అనుసరిస్తున్న ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు, ఏకకాలంలో రెండు కోర్సులు చదివే అవకాశం వంటి వాటిని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యార్థులకు తరగతి గది అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు.
ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్‌పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. మూలాలను అంటి పెట్టుకొని ఉంటూనే, విద్యార్థుల విభిన్నమైన అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇక నుంచి వివిధ కోర్సుల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించాలని భారత్‌లోని ఆరు సెంట్రల్ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్‌పూర్ యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ అడ్మిషన్లు ప్రతి ఏడాది జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరిలో జరుగుతాయి.
ముసాయిదాలోని కీలక మార్పులు
- ఏడాదికి రెండుసార్లు కోర్సుల్లో చేరేందుకు ప్రవేశాలు కల్పిస్తారు. జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహిస్తారు.
- విద్యార్థి 12వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివాడనేది సంబంధం లేకుండా డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో లేదా వర్సిటీ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి.
- విద్యార్థులు డిగ్రీ కోర్సులో మొత్తం క్రెడిట్లలో 50 శాతం కోర్సులోని ప్రధాన సబ్జెక్టుల నుంచి పొందాలి. మిగతా 50 శాతం క్రెడిట్లను నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అప్రెంటిస్‌షిప్, బహుళ సబ్జెక్టుల నుంచి పొందొచ్చు.
- విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ లేదా పీజీ కోర్సులను చదివే అవకాశం ఉంటుంది.
- డిగ్రీ కోర్సు వ్యవధిని తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు వీలు ఉంటుంది. ఇందుకోసం యాక్సెలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏడీపీ), ఎక్స్‌టెండెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఈడీపీ) విధానాలను ప్రవేశపెట్టనున్నారు.
More Stories
పూర్తి నిషేధంతో మాఫియా చేతుల్లోకి బాణాసంచా పరిశ్రమ
మదర్సా మరుగుదొడ్లలో 40 మంది బాలికల నిర్బంధం
తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలను వెళ్లగొట్టవచ్చు