రోడ్డు ప్రమాదాల్లో ఏడాదిలో 1.68లక్షల మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదాల్లో ఏడాదిలో 1.68లక్షల మంది దుర్మరణం

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ఇందులో 60 శాతం మంది యువకులేనని తెలిపారు. కేంద్రమంత్రి లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

రోడ్డు ప్రమాదాలు, ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం, టోల్‌ సెంటర్ల సంఖ్య వరకు పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ లోక్‌సభలో ఢిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే లోపాలను ఎత్తి చెప్పారు. ఇప్పటివరకు 150 మంది మృతి చెందారని, దౌసాలోనే 50 మందిపైగా మరణించారని నాగౌర్‌ ఎంపీ తెలిపారు. 

ఎక్స్‌ప్రెస్‌వేపై నియమించిన కాంట్రాక్టర్‌లు, అధికారులపై చర్యలు, విచారణ నివేదికకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన బదులిచ్చారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అని, ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో నిర్మించినట్లు తెలిపారు. రూ.లక్ష కోట్ల ఖరీదుతో వేశామని చెబుతూ పలుచోట్ల రోడ్డు దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. 

ఈ విషయంలో నలుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని గడ్కరీ స్పష్టం చేశారు. అధికారులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు చేయాలని కోరుకుంటున్నామని, కాంట్రార్ట్‌లు గడువులోగా పనులు చేయాల్సిందేనని తెలిపారు. ఎవరితో ఏ విషయంలోనూ రాజీపడబోమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. 

ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను అరికట్టేందుకు సమాజం సహకరించాలని గడ్కరీ కోరారు. ఏ అల్లర్లలోనూ ఇంత మంది చనిపోలేదని, రోడ్డు ప్రమాదాల్లోనేనని చెప్పారు. చనిపోయిన వారిలో 60శాతం మంది బాలబాలికలు ఉన్నారని తెలిపారు. చట్టం అంటే భయము, భక్తి లేకపోవడం సమాజంలో పెద్ద సమస్యగా మారిందని చెబుతూ  ఎర్ర సిగ్నల్‌ వద్ద ఆగకపోవడం, హెల్మెట్లు ధరించకపోవడంవంటి సమస్యలు ఈ కారణంగానే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

హెల్మెట్లు ధరించని కారణంగానే 30వేల మంది చనిపోతున్నారని చెప్పారు. మహారాష్ట్ర శాసన మండలిలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో గాయపడితే నాలుగు చోట్ల ఎముకలు విరిగాయని, ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నానని ఆయన తెలిపారు. రోడ్డు భద్రత విషయంలో ఎంపీలు సైతం సహకరించాలని కేంద్ర మంత్రి  కోరారు.