ఇంకా చైనాతో కొన్ని భూభాగాలపై విభేదాలు

ఇంకా చైనాతో కొన్ని భూభాగాలపై విభేదాలు

వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)లో ఇంకా చైనాతో కొన్ని భూభాగాలపై విభేదాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్‌ తెలిపారు. జూన్‌ 2020 గాల్వాన్‌ లోయరలో జరిగిన ఘర్షణ ఘటన భారత్‌ – చైనా సంబంధాలపై ప్రభావం చూపిందని రాజ్యసభలో చెప్పారు.

సరిహద్దులో సైనికులు మారణించడం 45 ఏళ్లలో మొదటిసారి కాదని, అయితే, ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో బలగాల మోహరింపునకు దారి తీసిందని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ మన సైనిక బలగాలు కరోనా , లాజిస్టిక్స్‌ సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలోనూ గాల్వాన్‌ ఘటనలో అవసరమైన మేరకు స్పందించాయని ఆయన ప్రశంసించారు. 

తీవ్రమైన చలితోపాటు ఎన్నో సవాళ్ల మధ్య వేగంగా పరిస్థితిని ఎదుర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని దళాల ఉపసంహరణ దశలవారీగా ప్రక్రియ పూర్తయ్యిందని చెబుతూ దేప్‌సాంగ్‌, డెమ్‌చోక్‌లలో పూర్తి కాలేదని తెలిపారు.  ఎల్‌ఏసీ ఒప్పందాలకు కట్టుబడి ఉండడంపై ఇరుదేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని జైశంకర్ స్పష్టం చేశారు. 

సంబంధాలు చాలారంగాల్లో పురోగామించాయని పేర్కొంటూ ఇటీవలి సంఘటనలు స్పష్టంగా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడం, సంబంధాల మెరుగునకు ప్రాథమిక షరతులు విధించామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చైనాతో భవిష్యత్‌ సంబంధాలపై స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సంబంధాలను పెంపొందించుకునేందుకు సరిహద్దులో శాంతి అవసరమని ఆయన చెప్పారు. చైనా ప్రతినిధులతో ఇటీవల జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను సైతం రాజ్యసభకు వివరించారు. 

ఆ తర్వాత బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చర్చించారని జైశంకర్ వెల్లడించారు. జైశంకర్‌ ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష సభ్యులు వివరణ కోరేందుకు అనుమతి కోరగా డిమాండ్లను చైర్మన్‌ జగ్‌దీప్‌ ధంకర్‌ తోసిపుచ్చారు. అభ్యంతరం వ్యక్తం చేయడంతో విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు.