రఫేల్‌- ఎం యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సిద్ధం

రఫేల్‌- ఎం  యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ సిద్ధం

* అమెరికా నుంచి భారీస్థాయిలో హెలికాప్టర్‌ పరికరాలు

రఫేల్‌- ఎం  యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుంది. నౌకాదళం కోసం అదనంగా మూడు స్కార్పియన్‌ శ్రేణి జలాంతర్గాములు, 26 రఫేల్‌ ఎం విమానాలను భారత్‌ కొనుగోలు చేయనుంది. మరోవైపు, భారత్‌కు భారీస్థాయిలో హెలికాప్టర్‌ విడిభాగాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈమేరకు పెంటగాన్‌ ఓ కీలక ప్రకటన చేసింది.

రఫెల్-ఎం  యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాలపై వచ్చే నెలలో సంతకాలు జరగవచ్చని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె త్రిపాఠి తెలిపారు. ఇప్పటికే ఈ ఒప్పందం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్‌ను సందర్శించి మంతనాలు జరిపారు. 

విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ సహా వివిధ స్థావరాల్లో రఫేల్‌-ఎం యుద్ధ విమానాలను మోహరించాలని భారత నౌకాదళం భావిస్తోంది. వీటి రాకతో భారత తీర ప్రాంత రక్షణ, శత్రువుపై దాడి చేసే సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. సెప్టెంబర్‌లోనే రఫేల్‌-ఎం యుద్ధ విమానాలకు సంబంధించిన తుది ధరలను భారత్‌కు ఫ్రాన్స్‌ ఇచ్చింది. 

22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌ మెరైన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, మరో నాలుగు ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. వీటితో పాటు పెద్ద సంఖ్యలో దీర్ఘశ్రేణి ఎయిర్‌ టు ఎయిర్‌ మిస్సైల్స్‌ను, యాంటీ షిప్‌ ఆయుధాలను ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్‌ సమకూర్చుకోనుంది.

మరోవంక, భారత్కు 1.17 బిలియన్‌ డాలర్ల (రూ.9.9 వేల కోట్లు) విలువైన హెలికాప్టర్‌ విడిభాగాల విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదించింది. ఈ విడిభాగాలు ఎంహెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్‌ల బలోపేతానికి విక్రయించనున్నట్లు పెంటగాన్‌ తెలిపింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ అనే కంపెనీ ఈ ఒప్పందంలో కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది.

సముద్రజలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు ఈ ఎంహెచ్‌-60 సీహాక్‌ హెలికాప్టర్‌లు వినియోగిస్తారు. ఇందులోని 38 లేజర్‌- గైడెడ్‌ రాకెట్‌లు, నాలుగు ఎంకే54 టోర్పిడోలు, మెషీన్‌గన్‌లు శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి.  హెలికాప్టర్‌ ముందుభాగంలోని ఫార్వర్డ్‌- లుకింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన కచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ లోహవిహంగం ఒక ప్రాంతాన్ని స్కాన్‌ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలను సైతం చేస్తుంది.