హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు‌పై 5.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.
 
అలాగే ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 7.20 గంటల నుంచి 7.27 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.  భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్‌గూడాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.  అలాగే సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించిందని సమాచారం. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(S) మండలం పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్‌ ప్రాంతాల్లో సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం.  మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్పల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.