పెట్రోల్, డీజిల్, క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్ రద్దు

పెట్రోల్, డీజిల్, క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్ రద్దు
దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుపై వీటిపై విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని నెలల పాటు జరిగిన విస్తృత చర్చలు, సమాలోచనల అనంతరం క్రూడ్ ఉత్పత్తులతో పాటుగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపైనా ఈ పన్ను తొలగించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
ఈ ఒక్క ప్రకటనతోనే దేశీయంగా దిగ్గజ చమురు కంపెనీలుగా ఉన్న ఓఎన్ జిసి, ఆయిల్ ఇండియా, నయారా, రిలయన్స్ వంటి సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వీటిపై భారీగా పన్ను భారం తగ్గనుండటంతో వాటి మార్జిన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా దిగొస్తుండటంతోనే కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పన్ను రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌదరీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

విండ్‌ఫాల్ టాక్స్ అనేది దేశీయంగా ముడి చమురును వెలికితీసి పెట్రోల్, డీజిల్ సహా ఇతర క్రూడ్ ప్రొడక్ట్స్ రూపంలో విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలపై విధించే పన్ను. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఆయిల్ కంపెనీలు ఇలా పెద్ద ఎత్తున ముడి చమురు వెలికితీసి దేశీయంగా విక్రయించకుండా విదేశాలకు భారీ ధరకు ఎగుమతి చేసి అసాధారణ లాభాలు ఆర్జించాయి. 
 
దీంతో వీటి లాభాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో కేంద్రం 2022, జులై 1న మొదటిసారి విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో లీటర్ పెట్రోల్‌పైన రూ. 6, ఏటీఎఫ్‌పైన రూ. 13 చొప్పున ఈ ఎగుమతి సుంకం వసూలు చేసింది కేంద్రం. ముడి చమురుపైన టన్నుకు రూ. 23,250 గా టాక్స్ ఉండేది. 
 
ఇలా మొదటి సంవత్సరంలో విండ్‌ఫాల్ టాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 25 వేల కోట్లు, 2023-24లో రూ. 13 వేల కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 6 వేల కోట్ల వరకు సుంకం రూపంలో ఖజానాకు వచ్చి చేరింది. ఇదే సమయంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చమురు ధర బ్యారెల్‌కు దిగుమతి ధర 90 డాలర్లుగా ఉండగ సెప్టెంబర్ నెలలో అది 73.69 డాలర్లకు దిగొచ్చింది.

విండ్‌ఫాల్ టాక్స్ పన్ను రద్దు పెట్రోల్ ధరలపై నేరుగా ఎలాంటి ప్రభావం చూపించదు. చాలా కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 107.46 వద్ద ఉండగా, డీజిల్ లీటర్‌కు రూ. 95.70 వద్ద ఉంది.