సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోదీ

సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోదీ

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన `ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర ఎంపీలు ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమాను అందరూ చాడాలని ఇటీవల ఓ నెటిజన్‌ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌పై ప్రధాని మోదీ స్పందించారు.

కల్పిత కథనాలు పరిమితకాలమే కొనసాగుతాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని అందులో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్​డీఏకి చెందిన పలువురు ఎంపీలతో సినిమా చూశానని చెప్పారు. మేకర్స్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పార్లమెంట్‌లోని లైబ్రరీలో ప్రదర్శించిన ఈ సినిమాను వీక్షించిన అనంతరం విక్రాంత్‌ మాస్సే మీడియాతో మాట్లాడుతూ “ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించడం చాలా సంతోషంగా ఉంది. ఇదో ప్రత్యేక అనుభూతి. మాటల్లో వర్ణించలేను. ఇది నా కెరీర్‌లో అత్యున్నత దశ” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

 “ఇప్పటివరకు ఈ సినిమాను చాలా సార్లు చూశాం. కానీ, ప్రధాని మోదీ సమక్షంలో చూడడం చాలా స్పెషల్‌. ఇప్పుడు ఈ సినిమాను ప్రజలు మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని నటి రాశీఖన్నా పేర్కొన్నారు.  సినిమా చూసిన అనంతరం బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మాట్లాడుతూ “ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన అంశాలను చూపించారు. గత ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకు యత్నించింది. కొంతమంది ఎలాంటి రాజకీయాలకు పాల్పడ్డారో ఈ సినిమాలో చక్కగా చూపించారు” అని వ్యాఖ్యానించారు. 

కాగా 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ యావత్ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది ఫిబ్రవరి 27న పంచమహల్‌ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్ సర్నా ది సబర్మతి రిపోర్ట్‌ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్‌ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. నవంబర్‌ 15న ఇది విడుదలైంది.