జగన్ కేసులపై రెండు వారాల్లో వివరాలు కోరిన సుప్రీం

జగన్ కేసులపై రెండు వారాల్లో వివరాలు కోరిన సుప్రీం
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గల అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటు ఈడీ, సీబీఐ కేసుల వివరాలు విడిగా చార్ట్‌ రూపంలో అందించాలని సూచించింది. 
 
 జగన్ బెయిల్‌ను రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు రోజువారీ పద్ధతిలో విచారణకు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు తెలియజేశారు. విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రోజు వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ప్రశ్నించింది. ఏఏ కోర్టులలో ఏఏ కేసులు దాఖలయ్యాయి, వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

జగన్ అక్రమాస్తుల విషయంలో పలు కోర్టుల్లో డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు విచారణలో ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు చెప్పిప్పటికీ విచారణ జరగడం లేదంటే దీనిపై ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ కేసును జనవరికి వాయిదా వేయాలని జగన్‌ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది కోరగా, అందుకు సుప్రీం నిరాకరిస్తూ డిసెంబర్ 13న విచారణ జరుపుతామంటూ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది.