బంగ్లాదేశ్‌లో మరో మరో ఇద్దరు సాధువులు అరెస్ట్

బంగ్లాదేశ్‌లో మరో మరో ఇద్దరు సాధువులు అరెస్ట్

* చటోగ్రామ్‌లో మూడు దేవాలయాలు ధ్వసం

బంగ్లాదేశ్‌లో హిందువులుసహా మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వం మరో ఇద్దరు సాధువులను అరెస్ట్‌ చేసింది. జైల్లో ఉన్న చిన్మయ్​ కృష్ణదాస్​కు ఆహారం ఇచ్చి వస్తుండగా సాధువులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇస్కాన్‌ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్‌ దాస్‌ తెలిపారు. అంతేకాకుండా బంగ్లాదేశ్​లోని ఇస్కాన్ కార్యలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎక్స్​ వేదికగా తెలిపారు.

‘నవంబర్ 29న చత్తోగ్రామ్‌ జైలులో ఉన్న చిన్మయ్‌ కృష్ణదాస్​కు ఆహారం ఇచ్చేందుకు ఆదిపురు​ శ్యామ్​ దాస్​, రంగనాథ్​ దాస్​ వెళ్లారు. తిరిగి వస్తుండగా వాళ్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణదాస్‌ను కలిసేందుకు వెళ్లిన పూజారి శ్యామ్‌దాస్‌ ప్రభును శుక్రవారం అక్రమంగా అరెస్టు చేశారు’ అని థెయ్లిపారు. 

“అంతేకాకుండా ఇస్కాన్ కార్యాలయంను గుర్తు తెలియని దుండుగలు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్​లో ఇటువంటి సంఘటనలు ఆగడం లేదు. బంగ్లాదేశ్​లో ఉంటున్న హిందువుల క్షేమం కోసం ఇస్కాన్‌ భక్తులు ప్రార్థించాలి’ అని రాధారమణ్​ కోరారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత కోసం డిసెంబరు 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేయనున్నట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) వెల్లడించింది.

కాగా, బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) మాజీ సభ్యుడు, హిందూ పూజారి చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను దేశద్రోహం కేసులో ఆ దేశ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, ఛటోగ్రామ్‌తో సహా పలు ప్రాంతాల్లోని హిందువులు నిరసనలు చేపట్టారు. చిన్మయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బెయిల్‌ను ఛటోగ్రామ్ కోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం మరణించాడు. ఈ లాయర్ హత్యకు సంబంధించి బంగ్లాదేశ్ పోలీసులు ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 46 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 

మరోవంక, శుక్రవారం ఛటోగ్రామ్‌లో మూడు హిందూ ఆలయాలను ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడి శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పోర్ట్ సిటీలో జరిగింది. హరీష్ చంద్ర మున్సెఫ్ వీధిలో గల శాంతనేశ్వరి మాత్రి ఆలయం, సమీపంలోని శోని ఆలయం, శాంతనేశ్వరి కాలిబారి ఆలయం ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్నారు

అనేక వందల మంది నినాదాలు చేసిన వ్యక్తులు దేవాలయాలపై ఇటుకలను విసిరారు. షోని ఆలయం, ఇతర రెండు ఆలయాల ద్వారాలను ధ్వంసం చేశారని ఆలయ అధికారులు తెలిపారు. కొత్వాలి ఆలయాలను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నించారని పోలీసు స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. అయితే ఆలయాలకు నామమాత్రపు నష్టం మాత్రమే వాటిల్లిందని పోలీసులు తెలిపారు. ఇరు పక్షాల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత, రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు ఇటుకలను విసురుకున్నారు. శాంతినేశ్వరి ప్రధాన ఆలయ నిర్వహణ కమిటీ శాశ్వత సభ్యుడు తపన్ దాస్ ఇలా చెప్పారు: 

“జుమా ప్రార్థనల తర్వాత వందలాది మంది ఊరేగింపు వచ్చారు . వారు హిందూ వ్యతిరేక, ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. మేము దాడి చేసిన వారిని అడ్డుకోలేదు. పరిస్థితి మరింత దిగజారినప్పుడు, మేము సైన్యాన్ని పిలిచాము. వారు త్వరగా చేరుకుని, ఆర్డర్‌ను పునరుద్ధరించడంలో సహాయం చేసారు. మధ్యాహ్నానికి ముందే ఆలయ ద్వారాలన్నీ మూసివేశారు. దుండగులు ఎటువంటి రెచ్చగొట్టకుండా వచ్చి దాడికి పాల్పడ్డారు”.

ఈ హిందూ వ్యతిరేక సంఘటనలు రెండు దక్షిణాసియా పొరుగు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో మాట్లాడుతూ బాంగ్లాదేశ్ లో హిందువులపై హింసాత్మక సంఘటనలను భారతదేశం తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, మైనారిటీలతో సహా పౌరులందరి జీవితం, స్వేచ్ఛను రక్షించడం ఢాకా ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.