కృష్ణదాస్ అరెస్ట్ పట్ల బెంగాల్ బిజెపి ఎమ్యెల్యేల నిరసన

కృష్ణదాస్ అరెస్ట్ పట్ల బెంగాల్ బిజెపి ఎమ్యెల్యేల నిరసన
బంగ్లాదేశ్ లో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసినందుకు ప్రతిస్పందనగా  బిజెపి శాసనసభ్యుల మార్చ్‌కు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి నాయకత్వంలో  కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌ వద్దకు నిరసన ప్రదర్శన జరిపారు. 
 
బంగ్లాదేశ్‌లోని హిందువులపై అఘాయిత్యాలు, హిందూ దేవాలయాలపై దాడులను ఆపాలని వారు కోరారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురు బిజెపి శాసనసభ్యులతో పాటు డిప్యూటీ హైకమిషనర్‌ను ఆయన కలిశారు.  “భారత్, బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలను [మీ దేశం] నాశనం చేస్తోందని మేము డిప్యూటీ హైకమిషనర్‌తో చెప్పాము” అని అధికారి స్పష్టం చేశారు. 
 
“మేము బంగ్లాదేశ్‌లో అనేక ప్రభుత్వాలను చూశాము. కానీ ఇంతకు ముందు ఈ రకమైన భారతదేశ వ్యతిరేక వైఖరి, హిందువులపై ఈ రకమైన దాడులను మేము ఎప్పుడూ చూడలేదు” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  చిన్మోయ్ కృష్ణ దాస్ 1971 లిబరేషన్ వార్ స్పూర్తికి అనుగుణంగా బంగ్లాదేశ్‌లో నిరసన తెలిపారని అధికారి పేర్కొన్నారు. సన్యాసిని విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పెద్దఎత్తున ర్యాలీలు, పాదయాత్రలతో నిరసనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
 
బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే అన్ని గూడ్స్ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే లక్ష్యంతో డిసెంబర్ 2న ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ వద్ద బిజెపి ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బిజెపి ఎమ్మెల్యేలుపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుండి బయలుదేరి  రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎక్సైడ్ మోర్ వద్ద గుమిగూడారు. 
 
 చిన్మోయ్ కృష్ణ దాస్, కాషాయ జెండాలను పట్టుకుని ఎజెసి  బోస్ రోడ్డు మీదుగా బెక్‌బాగన్ వైపు ప్రదర్శన సాగించారు. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలో మార్చ్‌ను నిలిపివేశారు. డిప్యూటీ హైకమిషనర్‌తో సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందంలో ప్రతిపక్ష నేతతో పాటు సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్, గైఘాటా ఎమ్మెల్యే, మతువా నాయకుడు సుబ్రతా ఠాకూర్ తదితరులు ఉన్నారు.