మత గురువులను అరెస్ట్‌ చేయించడం మంచిది కాదు

మత గురువులను అరెస్ట్‌ చేయించడం మంచిది కాదు

Ravi Shankar

బంగ్లాదేశ్‌ లో ఇస్కాన్‌ కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్‌ చేయడం పట్ల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్‌ రవిశంకర్‌ విస్మయం వ్యక్తం చేశారు.  మత గురువులను అరెస్ట్‌ చేయించడం ప్రభుత్వాలకుగానీ, ప్రజలకు గానీ, దేశానికి గానీ మంచిది కాదని  ఆయన హెచ్చరించారు.   పైగా బంగ్లాదేశ్‌కు చెడ్డపేరు తెచ్చి పెడుతుందని ఆయన హితవు చెప్పారు. 

శాంతి కోసం కృషిచేసి నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్న బంగ్లాదేశ్‌ ప్రధాని మహ్మద్‌ యూనస్‌ ఇలా ఒక మత గురువును అరెస్ట్‌ చేయిస్తారని అస్సలు అనుకోలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

‘చిన్మయి కృష్ణదాస్‌ ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఆయన దగ్గర తుపాకులు లేవు. ఆయన తన ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. ఆయన ప్రజల హక్కులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తిని బంగ్లాదేశ్‌ ప్రధాని అరెస్ట్‌ చేయించి ఉండకూడదు’ అని పండిట్‌ రవిశంకర్‌ స్పష్టం చేశారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టేవారిని వదిలేసి, హక్కుల కోసం పోరాడే వారిపై చర్యలకు దిగడం సరైనది కాదని రవిశంకర్‌ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌కు ఉదారవాద దేశంగా మంచి పేరుందని, ఆ దేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నదని, అలాంటి దేశాన్ని ప్రధాని యూనస్‌ వెనక్కి తీసుకుపోదలుచుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. చిన్మయి కృష్ణ దాస్‌ను విడిచి పెట్టాలని భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.