బంగ్లా ప్రభుత్వం అదుపులో ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభు

బంగ్లా ప్రభుత్వం అదుపులో ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభు
హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆయనను ఢాకా విమానాశ్రయంలో ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 
 
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ప్రభుత్వం ర్యాలీలు నిర్వహిస్తూ తాత్కాలిక ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. చిన్మయ్‌ ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా ఉన్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదైంది.

ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ చిన్మయ్ దాస్‌ అరెస్టును భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వయిజర్ కంచన్ గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ధ్రువీకరించారు.

 “ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని యూనస్ రిజిమ్ పోలీసులు ఢాకాలో అరెస్టు చేశారు. హిందువులపై విద్వేష పూరితదాడులను వ్యతిరేకిస్తూ, ఇస్లా్మిస్టుల నుంచి వారిని కాపాడాలనే డిమాండ్‌తో భారీ హిందూ ర్యాలీకి ఆయన సారథ్యం వహించడంతో ఆయనపై దేశద్రోహం ఆరోపణలు మోపారు. హిందూ కమ్యూనిటీలో ప్రముఖుడిగా గుర్తింపుపొందిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని తెలిసింది” అని కంచన్ గుప్తా తెలిపారు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా చిన్మయ్ కృష్ణదాస్‌‌ను ఆదేశించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉండగా ఆగస్టులో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమెకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. దాంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. 

ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. దీనికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. అక్టోబర్‌ నుంచి సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్‌ చేస్తూ నిరసనలు మొదలుపెట్టింది. ఇందులో చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభు పాల్గొని.. తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

హిందూ మైనారిటీలు కోసం ఎనిమిది ప్రధాన డిమాండ్లపై గళాన్ని వినిపించారు. మైనారిటీలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్‌ ఏర్పాటు, బాధితులకు పరిహారం, పునరావాసం, మైనారిటీ రక్షణ చట్టం అమలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, పూజాగృహాల నిర్మాణంపై గళం విప్పారు. 

హిందూ, బౌద్ధ, క్రైస్తవ, సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు, పాలీ-సంస్కృత విద్యా మండలి ఆధునీకరణ, దుర్గాపూజ సందర్భంగా ఐదు రోజుల సెలవులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.