బంగ్లాదేశ్ లో ఇస్కాన్ నేత అరెస్ట్ పట్ల భారత్ తీవ్ర నిరసన

బంగ్లాదేశ్ లో ఇస్కాన్ నేత అరెస్ట్ పట్ల భారత్ తీవ్ర నిరసన
బంగ్లాదేశ్ పోలీసులు ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హిందూ గ్రూపు సమ్మిలితా సనాతని, ఇస్కాన్ నాయకుడు చిన్మయి కృష్ణ దాస్ బ్రహ్మచారిని సోమవారం అరెస్ట్ చేయడం పట్ల భారత్ మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటనను “దురదృష్టకరం” అని పేర్కొన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హిందువులపై దాడులకు పాల్పడినవారు పరారీలో ఉన్నారని, సమాజ హక్కుల కోసం వాదించిన నాయకుడిపై అభియోగాలు మోపారని విస్మయం వ్యక్తం చేసింది. 
 
చిన్మయి కృష్ణ దాస్ బ్రహ్మచారి బెయిల్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ బంగ్లాదేశ్‌లోని కోర్టు మంగళవారం జైలుకు పంపాలని ఆదేశించింది. “చట్టోగ్రామ్ ఆరవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కాజీ షరీఫుల్ ఇస్లాం కోర్టు మంగళవారం ఉదయం 11:45 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది” అని ఓ వార్తాకథనం తెలిపింది. ఆయనకు బెయిల్ మంజూరు కాకపోవడంతో హిందూ పూజారి అనుచరులు కోర్టు ఆవరణలో నినాదాలు చేయడం ప్రారంభించారని న్యూస్ పోర్టల్ తెలిపింది.
 
 “బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోతే ప్రతినిధి కూడా అయిన శ్రీ చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడాన్ని మేము తీవ్ర ఆందోళనతో గుర్తించాము. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో అతివాద శక్తులు హిందువులు, ఇతర మైనారిటీలపై బహుళ దాడుల తర్వాత జరిగింది. మైనారిటీల గృహాలు, వ్యాపార సంస్థలను దగ్ధం చేయడం, దోపిడీ చేయడం, అలాగే దొంగతనం, విధ్వంసం, దేవాలయాలలో దేవతా విగ్రహాలను అపవిత్రం చేయడం వంటి అనేక నమోదైన కేసులు ఉన్నాయి” అని భారత్  ఒక ప్రకటనలో తెలిపింది.
 
 “ఈ ఘటనలకు పాల్పడినవారు పరారీలో ఉండగా, శాంతియుతంగా సమావేశాల ద్వారా న్యాయబద్ధమైన డిమాండ్‌లను అందజేస్తున్న మత నాయకుడిపై అభియోగాలు మోపడం దురదృష్టకరం. శ్రీ దాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులను కూడా మేము ఆందోళనతో గమనిస్తున్నాము” అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 
 
 “హిందువులు, మైనారిటీలందరికీ శాంతియుతంగా సమావేశమయ్యే, భావవ్యక్తీకరణ స్వేచ్ఛతో సహా భద్రత కల్పించాలని మేము బంగ్లాదేశ్ అధికారులను కోరుతున్నాము” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.