పోలవరం ప్రాజెక్ట్ ఎత్తులో రెండు దశలు లేవు

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తులో రెండు దశలు లేవు
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టత ఇచ్చింది. ఆర్టీఐ కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి సమాధానం ఇచ్చిన పీపీఏ, ప్రాజెక్టులో రెండు దశలు లేవని పేర్కొంది. 2021 -23 మధ్య రాష్ట్ర ప్రభుత్వం వాటర్ కంపోనెంట్ కింద చెల్లింపులను రెండుగా విభజించాలని కోరినట్టు వెల్లడించింది. 
 
నిధుల రియంబర్స్‌మెంట్ కోసం పోలవరం ప్రాజెక్టును రెండుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. ఆర్టీఐ కింద 14 అంశాలపై అడిగిన సమాచారం మేరకు పీపీఏ సమాధానం ఇచ్చింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి ఎత్తు అంశంలో రెండు దశల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. 
 
2021 జూన్​లో ఏపీ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పనులు, ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కోసం +41.15 మీటర్లు, +45.72 మీటర్లుగా విభజించి పనులు చేయాలని సిఫార్సు చేసినట్టు వెల్లడించింది. ఈ సిఫార్సుతో కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి 2023 ఏప్రిల్​లో ఈ ప్రతిపాదనను రికార్డు చేసి మొదటి ఫేజ్ కింద నిధులను ఆమోదించినట్టు స్పష్టం చేసింది.

ఈ కారణంగానే ప్రాజెక్టులో మొదటి ఫేజ్ అనే నిర్ణయం తెరపైకి వచ్చినట్లు తెలిపింది. డిజైన్ కన్సల్టెంట్ ఏఎఫ్ఆర్​వై ఇండియాకి ఏపీ ప్రభుత్వం ఫీజు చెల్లింపు చేసిన అంశాలపై వివరణ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం నియమించిన కాంట్రాక్టరు డిజైన్​లకు చెల్లింపులు చేయాలని, అయితే దీనికి జలవనరుల శాఖ చెల్లింపులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 

 
గైడ్ బండ్ కట్టిన తర్వాత అక్కడ ఒండ్రు పేరుకుపోయిందని ఈ నేపథ్యంలో డిజైన్ మార్చకుండా రిటైనింగ్ వాల్ కట్టకూడదని పీపీఏ పేర్కొంది. కానీ మట్టి తీయడం వల్ల గైడ్ బండ్ కుంగి పోయిందని తెలిపింది. నిపుణుల ప్యానల్ సిఫార్సు మేరకు కొత్త డి- వాల్ నిర్మించాలని ప్రాజెక్టు అథారిటీ పేర్కొంది. 2024 నవంబర్ నుంచి 2025 జూలై మధ్య దీనిని పూర్తిచేయాలని స్పష్టం చేసింది. 
 
ప్రాజెక్టుకు జరిగిన నష్టం, పరిష్కారానికి మార్గాలు అన్వేషించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కట్ ఆఫ్ వాల్, గైడ్ బండ్ డిఫెక్ట్ లయబులిటీ కాల పరిమితి కింద ఉన్నాయని అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ఖర్చుతో తిరిగి నిర్మించాలని పేర్కొంది. 
 
అధీకృత డ్రాయింగ్ మేరకు రాక్ ఫిల్ గైడ్ బండ్ అప్రోచ్ ఛానల్​కు ఎడమ వైపున ఎలా ఉండాలో డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ నిర్దేశించినట్టు వెల్లడించింది. 2019లో పోలవరం ప్రాజక్టును మేఘా సంస్థకు రూ.1548 కోట్లకు ఇచ్చారని, ప్రస్తుతం అగ్రిమెంట్ విలువ రూ.2077.79 కోట్లకు పెరిగిందని తెలిపింది.