కాప్‌-29లో మాట నెగ్గించుకున్న సంపన్న దేశాలు

కాప్‌-29లో మాట నెగ్గించుకున్న సంపన్న దేశాలు

కాప్‌ ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌కి సంబంధించిన పార్టీల కాన్ఫరెన్స్‌ 29వ సెషన్‌లో సంపన్న దేశాలు తమ మాట నెగ్గించుకున్నాయి. వాతావరణంలోకి పెద్దయెత్తున కర్బన ఉద్గారాలను విడుదలజేసే సంపన్న దేశాలు క్లైమేట్‌ ఫైనాన్స్‌ కింద ఏటా లక్షా 30 వేల కోట్ల డాలర్లు చెల్లించాలని పేద, వర్థమాన దేశాలు పట్టుబట్టగా సంపన్న దేశాలు 25 వేల కోట్ల డాలర్లతో సరిపెట్టాలని చూశాయి.

దీనిని ఎట్టి పరిస్థితుల్లోను తాము అంగీకరించేది లేదని బడుగు దేశాలు స్పష్టం చేయడంతో కాప్‌-29 చర్చలు ప్రతిష్టంభనలో పడ్డాయి. దీనిని తొలగించడం కోసం సంపన్న దేశాలు కంటితుడుపు చర్యగా 30 వేల కోట్లకు పెంచుతూ సరికొత్త ప్రతిపాదనను ఆఖరి నిమిషంలో తీసుకొచ్చాయి. ఇంతకు మించి ఒక్క డాలర్‌ కూడా అదనంగా ఇచ్చేది లేదని తెగేసి చెప్పాయి.

అప్పటికే కాలాతీతం కావడంతో అనేక తర్జన భర్జనల అనంతరం ఆదివారం తెల్లవారుజామున 30 వేల కోట్ల డాలర్లు ప్యాకేజీకి బడుగు దేశాలు అయిష్టంగానే ఆమోదం తెలిపాయి. ఈ ఒప్పందాల్లో వాతావరణ ఫైనాన్సింగ్‌ కోసం న్యూ కలెక్టివ్‌ క్వాంటిఫైడ్‌ గోల్‌ (ఎన్‌సిక్యూజి) , పారిస్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం గ్లోబల్‌ కార్బన్‌ మార్కెట్‌ మెకానిజానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. 

ఈ వాతావరణ ఆర్థిక లక్ష్యాలు 2025 తర్వాత అమలులోకి వచ్చేలా ఒప్పందం నిర్దేశించింది. అభివృద్ధి చెందిన దేశాల నుండి ఏటా 30 వేల కోట్ల డాలర్ల నిధులు వర్థమాన దేశాల వాతావరణ చర్యలకు మద్దతుగా చెల్లిస్తాయని, 2035 నాటికి ఈ వార్షిక లక్ష్యం కనీసం లక్షా 30 వేల కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది స్థూలంగా వాతావరణ ఫైనాన్సింగ్‌ లక్ష్యమని అందులో పేర్కొన్నాయి. 

తదుపరి దశలో అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ చర్యలు చేపట్టడానికి, వచ్చే ఏడాది దేశాల వారీగా జాతీయంగా కోటాలు నిర్ణయించేందుకు ఈ ఒప్పందం ప్రాతిపదికగా ఉంటుందని భావిస్తున్నారు.

పారిస్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 6 ప్రకారం అంతర్జాతీయ కార్బన్‌ మార్కెట్‌ మెకానిజంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను దాదాపు 200 పార్టీలు బహుపాక్షిక చర్చల ద్వారా బ్రేక్‌ చేసి దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో పారిస్‌ ఒప్పందానికి సంబంధించి అపరిష్కృతంగా మిగిలి ఉన్న చివరి అంశం పరిష్కారమైంది. 

అంతేకాదు, కార్బన్‌ ట్రేడింగ్‌ మెకానిజం, గ్లోబల్‌ స్టాక్‌టేక్‌ అమలు, ఉపశమన చర్యలు, గ్లోబల్‌ అడాప్టేషన్‌ గోల్‌తో సహా వివిధ అంశాలపైనా సదస్సు కొన్ని నిర్ణయాలు చేసింది. వర్థమాన దేశాల అవసరాలను తీర్చడంలో సంపన్న దేశాల ఆర్థిక హామీలు ఇప్పటికీ ఆశించిన దానికన్నా చాలా తక్కువగా ఉన్నాయని ఎన్‌సిక్యూజి పత్రం వెల్లడించిందని, వారి ఆర్థిక బాధ్యతలను మరింత స్పష్టంగా వివరించాలని చైనా ప్రతినిధి బృందం నేత జావో యింగ్‌మిన్‌ పేర్కొన్నారు.