ఏకత్వ భావన వుంటే అంతా మనదే అన్న భావన వస్తుంది

ఏకత్వ భావన వుంటే అంతా మనదే అన్న భావన వస్తుంది

ఏకత్వ భావన వుంటే అంతా మనదే అన్న భావన వస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్తెలిపారు. అంతేకాకుండా అందరూ సుఖంగా వుంటేనే మనం కూడా సుఖంగా ఉంటామని   అర్ధమవుతుందని చెప్పారు. వాస్తవానికి సుఖం లభించాలంటే అందరూ సుఖమయ జీవితం జీవించాలని, అప్పుడే సుఖమయ జీవితం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు.

శిల్పకళా వేదికలో నాలుగు రోజులపాటు జరిగిన లోకమంథన్ భాగ్యనగర్ 2024 ముగింపు కార్యక్రమంలో ఆదివారం ప్రసంగిస్తూ ఇవన్నీ సిద్ధించాలంటే చాలా ఉపకరణాలు కావాలని చెప్పారు.  అందుకే పూర్వజులు ఈ భారత దేశాన్ని నిర్మించారని మోహన్ భాగవత్ తెలిపారు. భారతదేశం పుట్టిందే ఈ పునాదులపైన అని ఆయన పేర్కొన్నారు. 
 
చరిత్ర కన్ను తెరిచినప్పటి నుంచి కూడా ఈ ప్రయాణమే కనిపిస్తుందని, అప్పుడు మన పూర్వజులు ఎలాగైతే ఆలోచించి, జీవనం సాగించారో ఇప్పటికీ ఇంత సమాజం మారినా, ఆంతరంగికంగా మాత్రం ఆ పదార్థమే వుంటుందని, అలాంటి జీవనమే ఇప్పుడూ కనిపిస్తుందని తెలిపారు. ఇలాంటి జీవనయానం మరెక్కడా దొరకదని, కేవలం భారత్‌లోనే దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఎందుకంటే ఈ తత్వాన్ని అందరికీ పంచడం తమ కర్తవ్యంగా రుషులు భావించారని, దీనికి ఉపకరణంగా ఓ దేశం కావాలని భావించారని అదే భారతదేశమని వెల్లడించారు. ఈ దేశం సనాతనమని ఆయన ప్రకటించారు. ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని చెబుతూ సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందని ఆయన తెలిపారు. 
 
నిజమైన సుఖం లోపల లేదని, అంతరంగంలో శోధించడం ప్రారంభిస్తేనే అసలైన సత్యం దొరుకుతుందని డా. మోహన్ భాగవత్ చెప్పారు. లోకం, సృష్టి, ధర్మం ఈ మూడూ కలిసే నడుస్తాయని, ప్రళయం వరకూ వుంటాయని చెప్పారు.  ఇవి సనాతనమని, ఈ మూడూ కలిసి వుంటేనే అస్తిత్వం అన్నది కొనసాగుతుందని, పుట్టడం, పెరగడం, మార్పుచెందడం, నశించడం ఈ మూడింటితోనే వుంటాయని తెలిపారు. ఈ సత్యాన్ని మన పూర్వీకులు శోధించారని, ఇతర సమాజం శోధించలేదని ఆయన తేల్చి చెప్పారు.
వివిధ వాసనలు, వివిధ కర్మలతో మనకు మనుష్య జన్మ లభించిందని చెబుతూ వాటిని పూర్తి చేసుకోడానికి పరుగెత్తుతారని డా. భగవత్ చెప్పారు. ఒకానొక దశలో అలసి పోయి ఆగిపోతామని, కానీ ఆనందమూ దొరకదని తెలిపారు. సంతోషమూ లభించదని, మరి కొంత సమయం తర్వాత శరీరం విడిచిపెట్టేస్తాం… ఇలా అనుకునే ఆగిపోతామని చెప్పారు. కానీ… మన పూర్వీకులు ఆగిపోలేదని, వారికి బయట దొరకలేదు కాబట్టి అంతరంగంలో శోధించడం ప్రారంభించారని ఆయన వివరించారు. అప్పుడు అసలైన సత్యం వారికి లభించిందని తెలిపారు.
రుషులు వనాల్లో వుంటూ వ్యవసాయం కూడా చేసేవారని, ఈ సమయంలోనే మన శాస్త్రాలు, ప్రపంచం అంతా బయటపడిందని ఆయన తెలిపారు. అయితే.. ఈ భారత భూమిలో అప్పటి నుంచి అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా, ధనవంతుడైనా, నిత్య దరిద్రుడైనా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఏ ఇంట్లో పుట్టాడు? అన్న భేదం లేకుండా మన రుషులకు ఏ విషయమైతే తెలుసో వీరందరికీ ఆ విషయం తెలుసునని  డా. భగవత్ వివరించారు. 
 
 కానీ కొందరు సాక్షాత్కారం చేసుకున్నారు, అనుభవంలోకి తెచ్చుకున్నారు, కొందరు తెచ్చుకోలేదని, అంతే కానీ.. విషయ పరిజ్ఞానం మాత్రం అందరికీ తెలుసని, అనుభూతిలోకి తెచ్చుకోలేదు కానీ ఆ సంస్కారం మాత్రం వుందని ఆయన చెప్పారు.
 
ఒకప్పుడు అటవీ సంపద, అడవిపై హక్కులన్నీ గిరిజనులకే వుండేవని, కానీ . ఆంగ్లేయుల పాలన వచ్చిన తర్వాత ఈ హక్కులన్నింటినీ వారి చేతుల్లోకి తీసుకున్నారన్నారని తెలిపారు. అలాగే ఆంగ్లేయులు మన సంస్కృతిని కూడా ధ్వంసం చేశారని, వారు అన్నింటినీ ధ్వంసం చేశారని, అయితే.. కేవలం పరాయి పాలన వల్ల మాత్రమే ఇలా జరిగిందా? అంటే కాదని వివరించారు. 
 
మనం అధ:పాతాళానికి వెళ్లిపోయామని, మన పూర్వజులు అద్భుతమైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీవనాన్ని సాగించినా. మనం ఆత్మ విస్మృతిలోకి దిగజారామని తెలిపారు. మనమెవరం? మన కర్తృత్వ భావన ఏంటి? ఇదంతా మరిచిపోయామని తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్ రెడ్డి కూడా ప్రసంగించారు.