
* లగచర్ల తిరుగుబాటుతో మాట మార్చిన రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతుల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటమార్చారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నది ఫార్మావిలేజీ కాదని, పారిశ్రామిక కారిడార్ అని చెప్పారు. అక్కడ కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, భూసేకరణ పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని శనివారం వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందానికి సీఎం భరోసా ఇచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయోఏషియా సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీని రద్దుచేస్తున్నామని, రాష్ట్రంలో పది ఫార్మా విలేజ్‌లను ఏర్పాటుచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో మెదక్, వికారాబాద్, నల్లగొండలో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టంచేశారు.
అయితే, ఈ మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవని, ప్రైవేటుగా రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మావిలేజీని ఏర్పాటుచేయాలని సీఎం పట్టుదలగా ఉండటంతో అధికారులు ఫార్మా పరిశ్రమల కోసం నోటిఫికేషన్ జారీచేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టారు.
ఈ ప్రాంతంలో తన అల్లుడికి చెందిన ఫార్మా పరిశ్రమను ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఇంత పట్టుదల చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో లగచర్లలో అధికారులు భూసేకరణకు చర్యలు ప్రారంభించగా, రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తమ భూములను ఫార్మాసిటీకి ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు.
లగచర్ల ఘటనలో పోలీసులు అర్థరాత్రి దళితులు, గిరిజనులు, మహిళలపై దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వం ఈ ఏడాది 19న విడుదల చేసిన గెజిట్‌లో మాత్రం ఫార్మావిలేజీగా స్పష్టంగా పేర్కొన్నది. కొత్త గెజిట్ విడుదల చేయకుండా నోటిమాటగా సీఎం మాటమార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా పారిశ్రామిక కారిడార్ ముసుగులో భూములు సేకరించి, తర్వాత ఫార్మా పరిశ్రమలు ఏర్పాటుచేసే కుట్ర జరుగుతుని స్పష్టం అవుతుంది. కొడంగల్‌లో దొరల సీలింగ్ భూములు 1,156 ఎకరాలు పడావుగా ఉన్నాయని, వాటిని పరిశ్రమల కోసం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని వామపక్షాలు సీఎంకు సూచించాయి. కాగా, సీఎం మాత్రం భూసేకరణకు నష్ట పరిహారం పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం.
దీనినిబట్టి పరిశ్రమల కారిడార్ కోసం సీఎం భూసేకరణ చేయించేందుకే పట్టుదలగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరోచోట ఫార్మా విలేజ్ అంటూ భూసేకరణ చేపట్టడం వెనుక ఆంతర్యం గమనార్హం.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత