టెస్టుల్లో కోహ్లీ 30వ సెంచరీ

టెస్టుల్లో కోహ్లీ 30వ సెంచరీ

బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముందు భారత్‌ భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యచేధన కోసం బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ నాథన్‌ మెక్‌ స్వీని ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ (100*), యశస్వి జైస్వాల్‌ (161) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (77) అర్ధశతకం సాధించగా, పడిక్కల్‌ (25), సుందర్‌ (29) ఫర్వాలేదనిపించారు. నితీశ్‌ (38*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులు చేయగా, ఆసీస్‌ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ రెండు, స్టార్క్‌, హేజిల్‌వుడ్, కమిన్స్‌, మిచెల్ మార్ష్‌ తలో వికెట్ పడగొట్టారు.

‘కింగ్​’ కోహ్లీ తన 80వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను 143 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. కోహ్లీ 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం.  టెస్టు కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 30వ సెంచరీకాగా.. ఓవరాల్‌గా అతని సెంచరీల రికార్డ్ 81కి చేరింది. కోహ్లీ సెంచరీ పూర్తి కాగానే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆసీస్‌ ముందు 534 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

అంతకుముందు మూడో రోజు ఆట మొదలవగానే భారత ఓపెనర్‌లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ తమ నిలకడైన ఆటను కొనసాగించారు. అయితే కాసేపటికి తన వ్యక్తిగత స్కోర్‌ 77 పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత జైస్వాల్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తర్వాత ఆటలో దూకుడు పెంచి 161 పరుగులకు చేరుకున్న తర్వాత ఔటయ్యాడు. జైస్వాల్‌ ఔట్ తర్వాత పంత్‌, ధ్రువ్‌ జురేల్‌ వెంటవెంటనే ఔటయ్యారు.

విరాట్‌ కోహ్లీ నిలదొక్కుకుని వాషింగటన్‌ సుందర్ (29), నితీష్‌ రెడ్డి (38 నాటౌట్‌) సహకారంతో పరుగుల వరద పారించాడు. మొత్తానికి 145 బంతులను ఎదుర్కొని టెస్టుల్లో తన 30వ సెంచరీని సాధించాడు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ ఔటవగానే క్రీజులోకి వచ్చిన పడిక్కల్‌ (25) కుదురుకుంటున్నట్లే కనిపించినా కొద్దిసేపటికే ఔటయ్యాడు.